ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తోడళ్లుడు, వైసీపీ సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు జగన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు హితేష్ చెంచురామయ్యను రెడ్ కార్పెట్ వేసి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే జగన్ అప్పటి వరకు అక్కడ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న రావి రామనాథం బాబును పక్కన పెట్టి దగ్గుబాటికి పార్టీ పగ్గాలు అప్పగించారు. ఈ ఎన్నికల్లో దగ్గుబాటి పర్చూరులో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
జగన్ వేవ్ ఇంతగా ఉన్నా కూడా అక్కడ దగ్గుబాటి టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. ఇక ఎన్నికలకు ముందు అప్పటి వరకు కష్టపడిన రావి రామనాథం బాబును జగన్ పక్కన పెట్టడంతో ఆయన తీవ్ర మనస్థాపంతో అప్పుడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. ఆ ఎన్నికల్లో రామనాథం ఏలూరి సాంబశివరావు గెలుపుతో పాటు దగ్గుబాటి ఓటమికి కృషి చేశారు. ఇప్పుడు దగ్గుబాటిని ఓడించిన ఆ రామనాథం బాబునే జగన్ నాలుగు నెలలు కూడా కాకుండానే పార్టీలో చేర్చుకున్నారు.
నిజానికి ఇప్పటికిప్పుడు రాంబాబును పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరాలు ఏమీ లేవు. అయితే జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పార్టీ పరిశీలకుడు, ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల ప్రత్యేక ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ల సమక్షంలో ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. దగ్గుబాటికి చెక్ పెట్టేందుకే ఆయన్ను పార్టీలో చేర్చుకున్నట్టు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
జగన్‌కు అత్యంత ఇష్టుడు అయిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో పాటు జిల్లా మంత్రి బాలినేని, సజ్జల రామకృష్ణారెడ్డి ముగ్గురు పట్టుబట్టడంతోనే రామనాథం బాబు వైసీపీ రీ ఎంట్రీకి మార్గం సుగమం అయ్యిందంటున్నారు. దగ్గుబాటి భార్య, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి బీజేపీలో ఉండి ప్రతిసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అలాగే దగ్గుబాటి నియోజకవర్గంలో పార్టీశ్రేణులను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ కొందరు రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయాలపై సీఎం జగన్ మంత్రి బాలినేనితో మాట్లాడటం తెలిసిందే.
ఈ క్రమంలోనే దగ్గుబాటికి చెక్ పెట్టేందుకు జగన్ రామనాథం బాబును తిరిగి పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు. ఇక ఈ చేరికలో దగ్గుపాటితో చర్చించలేదంటున్నారు. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి, ఆయన కుమారుడు చెంచురామయ్య ఇద్దరూ లేరు. ఏదేమైనా పర్చూరులో దగ్గుబాటికి మెల్లగా చెక్ పెట్టేందుకు జగన్ స్కెచ్ గీసేశారని అంటున్నారు.