సామ, బేద , దండోపాయాలు అన్నిటినీ రాజకీయ శత్రువుల పై ఉపయోగించి వారిని రాజకీయాలకు దూరం చేయడమో లేక, వైసీపీలో చేరే విధంగా వారికి పరిస్థితులు కల్పించడమో వంటివి చేస్తూ.. మాట వినని వారిని ముప్పు తిప్పలు పెడుతూ .. మూడు చెరువుల నీళ్లు తాగించే కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ శ్రీకారం చుట్టినట్లు గానే కనిపిస్తున్నారు. ఇప్పుడు కాదు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన దగ్గర నుంచి జగన్ ఈ విధమైన ప్లాన్ చేస్తున్నట్లు గా కనిపిస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సైతం జగన్ రాజకీయానికి విలవిల్లాడుతున్నారు. టిడిపిలో నాయకులు చాలామంది ఇప్పటికే పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మరికొందరు హడావుడి చేస్తున్నా, అటువంటి నాయకులు ఇప్పుడు తమ దూకుడు తగ్గించేశారు.
ముఖ్యంగా జేసీ బ్రదర్స్ కి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ట్రావెల్స్ వ్యాపారాన్ని దెబ్బ కొట్టడంతో పాటు, జేసీ ప్రభాకర్ రెడ్డి జైలుకు వివిధ కేసుల్లో వెళ్లేలా చేశారు. అలాగే జెసి దివాకర్ రెడ్డి కి సంబంధించిన కంపెనీ గ్రానైట్ తవ్వకాల విషయంలో నిబంధనలు పాటించలేదని సుమారు 100 కోట్ల రూపాయలు జరిమానా అధికారులు విధించారు. ఇక ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఆర్థిక అండదండలు అందిస్తూ వచ్చిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు కు చెందిన గ్రానైట్ పరిశ్రమల పైన దాడులు జరిగాయి. గనులశాఖ 100 కోట్ల జరిమానా విధించింది. ఆ వెంటనే ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. అలాగే టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కి కూడా వ్యాపారాలు ఉండడం.. ఆయనకు ఇలాగే నోటీసులు అందడం జరిగాయి. అయితే న్యాయస్థానానికి వెళ్లి స్టే తెచ్చుకున్నారు.
ఇక గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విషయంలోనూ ఇదే పరిస్థితి. టిడిపి ప్రభుత్వంలో ఆయనకు కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఎక్కడికక్కడ నాయకులు నోటికి తాళం వేసే విధంగా జగన్ రాజకీయ వ్యూహం రూపొందించడంలో సక్సెస్ అవుతు టిడిపిని బలహీనం చేసే విషయం పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు.