పాల‌న‌లో హిట్‌… పాలిటిక్స్‌లో ఫ‌ట్ ఏంటి జ‌గ‌నూ…?

-

ఊహించని విధంగా 151 సీట్ల భారీ మెజారిటీతో తొలిసారి సీఎం అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో పాలన పరంగా దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అయితే నిర్ణయాలు తీసుకునే విధానంలో ఏం మాత్రం వెనక్కి తగ్గని జగన్, వాటి మీద వచ్చే విమర్శల వల్ల మాత్రం జగన్ పార్టీకి నష్టమే కలుగుతుందనే వాదన ఉంది.

అధికారం చేపట్టిన దగ్గర నుంచి పాలనలో భాగంగా ఆయన అనుకున్నదే చేస్తున్నారు. కానీ పాలన పరంగా వచ్చే రాజకీయ విమర్శలని కౌంటర్ చేయడంలో ఆయన గానీ, పార్టీ గానీ ఫెయిల్ అవుతుందనే చెప్పొచ్చు. ఉదాహరణకి ఆయన పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులోనే అవినీతిని బయటపెట్టి, ఇంకా తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తవ్వాలనే ఉద్దేశంతో రివర్స్ టెండరింగ్ కి వెళుతున్నారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది.

కానీ దీనిపై అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని ప్రతిపక్ష టీడీపీలు అభ్యంతరాలు పెడుతున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి సైతం జగన్ తీసుకున్న నిర్ణయం తప్పు అని దీని వల్ల ప్రాజెక్టు ఇంకా ఆలస్యమవుతుందని విమర్శించారు. ఇక టీడీపీ విమర్శల గురించి చెప్పన్నక్కర్లేదు. ఈ విమర్శలని మాత్రం రాజకీయంగా ఎదురుకోవడంలో వైసీపీ విఫలమైంది. పూర్తి స్థాయిలో దీని మీద ఆ పార్టీ నేతలు కౌంటర్లు ఇవ్వలేకపోయారు. దాని వల్ల ప్రజల్లో పోలవరం ఆగిపోతుందనే భావన కలిగింది.

అటు విద్యుత్ ధరలు తగ్గించాలనే లక్ష్యంతో పీపీఏలు పునఃసమీక్షిస్తానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గనని చెప్పారు. అయితే దీనిపై కూడా కేంద్రం అడ్డం పెట్టి రాష్ట్రానికి పెట్టుబడులు రావని చెప్పింది. చివరికి జపాన్ సంస్థ ఒకటి ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లెటర్ కూడా రాసింది. ఇందులో కూడా వైసీపీ రాజకీయంగా అనేక విమర్శలు పాలైంది.

అలాగే రాజధాని నిర్మాణం, ఇసుక పాలసీల విషయంలో కూడా అవినీతి జరిగిందని దాన్ని బయటపెడతానని చెప్పి , ప్రస్తుత బిల్డింగు నిర్మాణ పనులని, ఇసుక పంపకాలని ఆపేయించారు. దీనిపై వైసీపీ ప్రభుత్వంపై ఏ స్థాయిలో విమర్శలు వస్తున్నాయో తెలిసిందే. అటు గత టీడీపీ ప్రభుత్వం నిర్మించిన అన్న క్యాంటీన్లలో కూడా అవినీతి జరిగిందని వాటిని తాత్కాలికంగా నిలిపి వేయించారు. ఇక జగన ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థపైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

జగన్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని దీన్ని తీసుకొచ్చారు. కానీ వాలంటీర్ల నియమకాలు వైసీపీ నేతల కనుసన్నలో జరిగాయని ఆరోపణలు వచ్చాయి. వైసీపీ కార్యకర్తలకు, కావల్సిన వాళ్ళకే వాలంటీర్ జాబ్ ఇచ్చారని ప్రచారం జరిగింది. ఈ ఆరోపణలపై వైసీపీ పెద్దగా నోరుమెదపలేదు. మొత్తానికి జగన్ పాలన పరంగా తీసుకున్న మంచి నిర్ణయాల వల్ల లాభం జరిగినా…వాటి మీద వచ్చే రాజకీయ విమర్శల వల్ల మాత్రం నష్టం జరిగింది. అంటే జగన్ పాలనలో హిట్ అయినా..రాజకీయంలో మాత్రం ఫట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news