ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావులు ఇద్దరూ నేటి మధ్యాహ్నం 12 గంటలకు భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఇక ఇరువురు నేతలు కలిసి కాసేపట్లో భోజనం కలిసి చేస్తారు. అనంతరం వారిరువురూ సమావేశమై తాజా రాజకీయ పరిణామాలతో పాటు నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించనున్నట్లు తెలిసింది.
వీటితో పాటు విభజన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న పలు విషయాలపై వారు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో మూడు రాజధానుల అంశం వారిద్దరి మధ్య చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. 9,10 షెడ్యూల్ సంస్థల విభజన, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపు తదితర వాటిపై చర్చించనున్నట్టు సమాచారం.