అక్రమాస్తుల కేసు విచారణకు గాను ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, పారిశ్రామికవేత్త ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ తదితరులు కూడా కోర్టుకు వచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుకు జగన్ రావడం ఇదే ప్రథమం. అయితే తొలిసారిగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానం ముందు హాజరైన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇకపై తనకు ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు.
తాను కీలకమైన పదవిలో ఉన్నందున కోర్టుకు హాజరు కాలేనని, తన తరఫున కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తి హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ మేరకు జగన్ తరఫు న్యాయవాది కోర్టు ముందు ఓ పిటిషన్ వేయగా, జడ్జి దాన్ని పరిగణనలోకి తీసుకుని సీబీఐ అభిప్రాయాన్ని కోరారు. ఆపై కోర్టు విచారణను తదుపరి శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. జగన్ కేసులో ప్రధాన నిందితులంతా నేడు కోర్టుకు హాజరు కావడంతో, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో ఇతర కేసుల్లో కక్షిదారులకు, న్యాయవాదులకు కొంత ఇబ్బందులు కలిగాయి.