జ‌గ‌న్‌ను ఈ విష‌యంలో సొంత నేత‌లే విబేధిస్తున్నారే…!

-

ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌రిపాల‌నా ప‌రంగా స‌రికొత్త సంస్క‌ర‌ణ‌లు తెస్తున్నా.. పాల‌నా ప‌రంగా దూసుకు వెళుతున్నా కొన్ని ఇబ్బందులు మాత్రం త‌ప్ప‌డం లేదు. జ‌గ‌న్ తీసుకుంటోన్న సంస్క‌ర‌ణ‌లు సొంత పార్టీ నేత‌ల్లోనే కొంద‌రికి న‌చ్చ‌డం లేదు. ఇవి అమ‌ల్లోకి వ‌స్తే త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు ఎక్క‌డ ముప్పువాటిల్లుతుందో ? అన్న ఆందోళ‌న వారిని వెంటాడుతోంది. జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జిల్లాల‌ను విభ‌జిస్తాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే దీనిపై క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వెన‌క కూడా ఇదే కార‌ణం అంటున్నారు. వ‌చ్చే సంక్రాంతి త‌ర్వాత జిల్లాల‌ను విభ‌జించి.. కొత్త జిల్లాల ప్రాతిప‌దిక‌నే ఎన్నిక‌ల‌కు వెళ్లే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు.

అయితే జిల్లాలు విడిపోతే ఇప్ప‌టి వ‌ర‌కు ఉమ్మ‌డి పెద్ద జిల్లాల్లో రాజ‌కీయ ఆధిప‌త్యం చెలాయించిన కొంద‌రు నేత‌ల హ‌వాకు గండి ప‌డుతుంది. ఇదే వైసీపీలోని కొంద‌రు సీనియ‌ర్ల‌కు, కీల‌క నేత‌ల‌కు న‌చ్చ‌డం లేదు. మ‌రోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యం టీడీపీకి కూడా న‌చ్చ‌క‌పోయినా మౌనంగానే ఉంటూ వ‌స్తోంది. ఇక వైసీపీ సీనియ‌ర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం త‌మ జిల్లాను విభ‌జించ‌వ‌ద్ద‌ని.. త‌మ నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌రో జిల్లాలో క‌ల‌పాల‌ని.. త‌మ‌కే ఓ జిల్లా ఏర్పాటు చేయాల‌ని ర‌క‌ర‌కాల డిమాండ్లు తెర‌మీద‌కు తీసుకు వ‌స్తున్నారు.

అర‌కు నియోజ‌క‌వ‌ర్గం నాలుగు జిల్లాల్లో ఉంది. ఈ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని జిల్లా చేయ‌డం స్థానిక నేత‌ల‌కు న‌చ్చ‌డం లేదు. అర‌కుతో సంబంధం లేకండా త‌మ‌కో జిల్లా కావాల‌ని పార్వ‌తీపురం, సాలూరు నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జాప్ర‌తినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాను మూడు ముక్క‌లు చేయ‌డాన్ని మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఒప్పుకోవ‌డం లేదు. ఇక కృష్ణా జిల్లాలో ఉన్న నూజివీడు, కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఏలూరులో క‌ల‌ప‌వ‌ద్ద‌ని అక్క‌డ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌ను తిరుప‌తి జిల్లాలో క‌ల‌ప‌వ‌ద్ద‌ని అక్క‌డ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇక మ‌ద‌న‌ప‌ల్లి ప్ర‌త్యేక జిల్లా కావాల‌ని చిత్తూరు జిల్లాలో కొంద‌రు పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. మ‌రి సొంత పార్టీ నేత‌ల నుంచి వ‌స్తోన్న ఈ డిమాండ్లు, ఒత్తిళ్ల‌ను జ‌గ‌న్ ఎలా ఎదుర్కొని కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news