కెసిఆర్ నియంత పాలనలో నిరుద్యోగులకు తొమ్మిదేండ్లుగా అన్యాయమే జరుగుతోందన్నారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగత అజెండాలు పక్కనపెట్టి, పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం T-SAVE (Telangana Students Action For Vacancies & Employment) అనే ఫోరాన్ని ప్రతిపాదిస్తున్నానని తెలిపారు.
హౌజ్ అరెస్టులు, అక్రమ కేసులతో కెసిఆర్ నిరంకుశ సర్కారు ప్రశ్నించకుండా, పోరాడకుండా నిర్బంధిస్తోందని మండిపడ్డారు. అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి, పోరాడితేనే కేసీఆర్ మెడలు వంచగలం అన్నారు షర్మిల. అప్పుడే నిరుద్యోగులకు న్యాయం చేయగలం అన్నారు. ఇందుకోసం ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.