గొప్పమనసు చాటుకున్న వైఎస్ షర్మిల..!

వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల గొప్ప మనసు చాటుకున్నారు. ప్రస్తుతం షర్మిల తెలంగాణలో “ప్రజా ప్రస్థానం” పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర సందర్భంగా షర్మిల ప్రస్తుతం మర్రిగూడ వద్దకు చేరుకున్నారు. మర్రిగూడ లోని క్యాంపు కార్యాలయంలో షర్మిల బస చేస్తున్నారు. అయితే క్యాంప్ కార్యాలయం సమీపంలో రోడ్ యాక్సిడెంట్ జరిగింది. రెండు బైకులు ఒకదాన్నొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు కావడంతో రోడ్డుపై పడిపోయారు.

అయితే ఈ విషయం షర్మిల దృష్టికి రాగా వెంటనే స్పందించారు. 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా అరగంట సమయం దాటినా అంబులెన్స్ రాలేదు. దాంతో షర్మిల వెంటనే తన సొంత కాన్వాయ్ లోని అంబులెన్స్ ను ఘటనా స్థలానికి పంపించారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక షర్మిల చేసిన పనికి స్థానికులు అభినందించారు.