జగిత్యాల పాత బస్టాండ్ వద్ద వైఎస్సార్‌టీపీ నిర్వహించిన బహిరంగసభలో పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల ప్రసంగిస్తూ.. మంత్రి కేటీఆర్ 420 అని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు షర్మిల. బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీగా మారిందని విమర్శించారు షర్మిల. కేసీఆర్ ఒక గజ దొంగ అన్న షర్మిల.. కాళేశ్వరం ప్రాజెక్టులో 70వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ధరణి పేరుతో భూములు కాజేసే కుట్రలకు తెరదీశారన్నారు షర్మిల. కేసీఆర్కు మునుగోడు అభివృద్ధి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని షర్మిల ప్రశ్నించారు.
8 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు షర్మిల. ఎన్నికలు వచ్చినప్పుడే అభివృద్ధి గుర్తుకొస్తుందని విమర్శించారు. రుణమాఫీ చేయకపోవడంతో రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు షర్మిల. స్థానిక ఎమ్మెల్యే ఒక కంటి డాక్టర్ అని.. అయినా అతనికి ప్రజాసమస్యలు కనిపించవని ఎద్దేవా చేశారు షర్మిల. ఎస్సారెస్పీ కాలువల మరమ్మతులు చేయించి లక్షా 60 వేల ఎకరాలకు నీళ్ళు అందించిన ఘనత వైఎస్సార్దేనని షర్మిల తెలిపారు. జేఎన్టీయూ, అగ్రికల్చర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంటర్ కాలేజీలు ఏర్పాటు చేశారని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలోని 22వేల కుటుంబాలు గల్ఫ్లో బతుకుతున్నాయని.. గల్ఫ్ బాధితులను సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు షర్మిల.