అసెంబ్లీ ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించినట్టు తెలుస్తోంది. వివేకానందరెడ్డిని చంపింది ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ అని పులివెందుల పోలీసులు కంక్లూజన్ కు వచ్చారు. ప్రొద్దుటూరు కు చెందిన సునీల్ గ్యాంగ్ సుపారీ తీసుకుని హత్యలు చేస్తుంటుంది.
సీసీ కెమేరాల ద్వారా ఈ సునీల్ గ్యాంగ్ వాడిన ఓ బైక్ ను పోలీసులు గుర్తించి దాని ద్వారా ఆధారాలు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ సునీల్ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చింది కడప జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డిగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ శ్రీనివాసరెడ్డి కూడా కొన్నిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం సంచలనం సృష్టించింది.
సునీల్ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చిన ఈ శ్రీనివాసరెడ్డి వెనుక ఉన్న కీలక వ్యక్తులు ఎవరన్న విషయంపై ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. సునీల్ గ్యాంగును గుర్తించడంతో ఇక విచారణ ఊపందుకుంటుందని ఈ హత్య వెనుక ఉన్న అసలు వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ హత్య జరిగింది. అయితే హంతకులెవరో మాత్రం తేలలేదు. చంద్రబాబు సర్కారు దిగిపోయిన జగన్ సీఎం అయినా వైఎస్ వివేకా హత్య కేసు మిస్టరీ వీడలేదు. ఇక ఇప్పుడు విచారణ జోరందుకోవచ్చు.