వన్ నేషన్ – వన్ ఎలక్షన్స్ అనే ప్రతిపాదనలో అనేక సానుకూలతలు ఉన్నాయనీ, వేల కోట్ల రూపాయలను ఆదా చేయవచ్చని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కూడా అయిన విజయ సాయి రెడ్డి రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్ సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ విధానం సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఏకకాల ఎన్నికల ఆలోచన కొత్తదేమీ కాదనీ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా గతంలో పలు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ నాయకుడు విజయసాయి రెడ్డి ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ పై స్పందించారు.