వైసీపీలో ముఖ్యమంత్రి జగన్ భక్తుడు ఆ ఎమ్మెల్యే. పార్టీలో సీనియర్ గా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఏది అయినా సరే పార్టీలో ధైర్యంగా మాట్లాడతారు అనే గుర్తింపు కూడా ఆయన సొంతం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ఆయన తీవ్ర ఆరోపణలు చేసే వారు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా సభలో సొంత పార్టీ నేతలపైనే తీవ్ర ఆరోపణలు శాసన సభ సాక్షిగా చేసి ఆశ్చర్యపరిచారు.
చాలాకాలం తరువాత మాట్లాడిన ఆయన, ఆయనే నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నేడు అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే తనకు శాసనసభలో అవకాశం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైకు ఇవ్వాలని గొంతు చించుకుని అరిచామని, అవకాశమివ్వమని చేయి ఎత్తి నొప్పి పుట్టే వరకూ ఉంచినా ఛాన్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.
సభలో ప్రసంగించే వారిలో తన పేరును జాబితాలో చేర్చేందుకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి ఎందుకు మనసు రావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు అవశామిచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో తమ అధినేత జగన్ పై అప్పటి మంత్రులు తీవ్రమైన పదజాలంతో దూషించారని, వారికి బుద్ధి చెప్పాలని మనసులో ఉన్నా తనకు అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.
తమ పార్టీ నేతలే తనకు సభలో మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటున్నారన్న ఎమ్మెల్యే తమ పార్టీకి చెందిన ప్రబుద్ధుడే తనకు నీతులు చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను తనకు బీ ఫారం ఇచ్చిన వైఎస్ జగన్ కు, తనను గెలిపించిన పార్టీ కార్యకర్తలకు, తనకు ఓటేసిన ప్రజలకు మాత్రమే తాను జవాబుదారీగా ఉంటానని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. అదే విధంగా విపక్ష పార్టీ పై కూడా ఆయన ఆరోపణలు చేసారు.