జగన్ కేబినెట్‌లోని సీనియర్ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత పార్టీలోనే సెగపుడుతోందా ? ఆయన మాటలను ఎవరూ ఖాతరు చేయడం లేదా ? ఆయనకు సెగలా మారుతోన్న కొన్ని పరిణామాలు.. మరింతగా పెరుగుతున్నాయా ? అంటే అమరావతి సర్కిల్స్‌లో అవునన్న టాక్ వినిపిస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి.. జిల్లాను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. తన కనుసన్నల్లోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాయకులకు ప్రమోషన్లు ఇచ్చినా.. పదవులు ఇచ్చినా.. పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇసుక, స్థలాల ఆరోపణలు కూడా వచ్చాయి.
దీంతో సీఎం జగన్ వరకు కూడా ఈ ఫిర్యాదులు వెళ్లడం, ఆయన పెద్దిరెడ్డికి క్లాస్ ఇవ్వడం వంటి వార్తలు ఇప్పటి వరకు వచ్చాయి. ఇది నిన్నటి వరకు ఉన్న నాణేకి ఒకవైపు మాత్రమే. ఇప్పుడు జిల్లాలో కీలక నేతలు పెద్దిరెడ్డినే లెక్కచేయడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీఐఐసీ చైర్మన్ రోజాతో పాటు జిల్లాకే చెందిన కొందరు నేతలతో పెద్దిరెడ్డికి విబేధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన మంత్రులు తమ నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి పెత్తనాన్ని సహించడం లేదని అంటున్నారు.
జిల్లాలో అభివృద్ధి పనులు, ఇతర ప్రభుత్వ పథకాల వరకు కూడా పెద్దిరెడ్డి ఏకపక్షంగా వ్యవహరించడంతో ఇప్పుడు కొందరు ఎమ్మెల్యేలు ఏకమై వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. రోజా ఇచ్చిన ధైర్యంతోనే వీరంతా పెద్దిరెడ్డి అయితే మాత్రం ఏంటనే కాడకు వచ్చినట్టు టాక్..? నిన్న మొన్నటి వరకు జగన్‌కు సన్నిహితంగా ఉండే మంత్రి కదా ? అని చూసి చూడనట్టు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు పెద్దిరెడ్డి పెత్తనంపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులతో పాటు అటు వైసీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేస్తున్నారట. నిన్నటి వరకు చూసీ చూడనట్టుగా ఉన్న జగన్ సైతం ఇప్పుడు పెద్దిరెడ్డిని తన శాఖకు, తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాలని సూచించినట్టు తెలుస్తోంది.