ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీలో ఓ ఎంపీ వర్సెస్ ఓ ఎమ్మెల్యే మధ్య జరుగుతోన్న ఆధిపత్య పోరుతో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజానగరం ఎమ్మెల్యే, ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా మధ్య కొద్ది రోజులుగా రాజకీయ ఆధిపత్య యుద్ధం ముదురుతోంది. ముఖ్యంగా రాజమహేంద్రవరం సిటీలో రాజా ఆధిపత్యం భరత్‌కు ఏ మాత్రం ఇష్టం లేదట. ఇద్దరు బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో పాటు ఇద్దరికి బలమైన ఫ్యామిలీ నేపథ్యం కూడా ఉండడంతో ఎవ్వరూ వెనక్కు తగ్గని పరిస్థితి ఉంది.
దీంతో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని రెండు గ్రూపులుగా చీలిపోయి చేస్తున్నారు. పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు చెప్పినా కూడా ఎవ్వరు వెనక్కు తగ్గడం లేదు. చివరకు సీఎం లెక్చర్ ఇచ్చినా కూడా వీరిలో మార్పు రాలేదు. సిటీతో జక్కంపూడి రాజా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. పైగా సిటీ వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శివరామ సుబ్రహ్మణ్యం జక్కంపూడి కుటుంబంతో అనుబంధం ఉన్న నేత కావడంతో ఆయన రాజాతోనే ఉంటున్నారు.
రాజా, శివరామ సుబ్రహ్మణ్యం ఒక్కటిగా ఉండడంతో భరత్ కూడా తన వర్గాన్ని పటిష్టం చేసుకుంటున్నాడట. దీంతో రెండు వర్గాల మధ్య ప్రతి విషయంలోనూ నువ్వా నేనా ? అన్నట్టుగా వార్ నడుస్తోంది. ఇక గుడ్ మార్నింగ్ రాజమహేంద్రవరం కార్యక్రమం ఏర్పాటు చేసిన రాజా, శివరామ సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమానికి మంత్రులు ధర్మాన కృష్ణదాస్, వేణుగోపాలకృష్ణను ఆహ్వానించారట. అయితే ఈ కార్యక్రమానికి ఎంపీకి ఆహ్వానం లేకపోవడంతో ఆయన దీనికి పోటీగా మరో కార్యక్రమం ఏర్పాటు చేశారు.
శుభోదయం… ప్రజల వద్దకు వైసీపీ కార్యక్రమం ఏర్పాటు చేసి దీనికి మంత్రులు కృష్ణదాస్, వేణుగోపాలకృష్ణను ఆహ్వానించారు. ఈ రెండు కార్యక్రమాలు ఒకేసారి ఏర్పాటు చేసిన విషయం తెలుసుకున్న ఇద్దరు మంత్రులు ఈ రెండు కార్యక్రమాలకు తెలివిగా డుమ్మా కొట్టారు. ట్విస్ట్ ఏంటంటే ఈ రెండు వర్గాలు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన డివిజన్లు కూడా 13, 31 కావడంతో ఇప్పుడు ఈ రెండు వర్గాల వార్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.