వైసీపీలో మూడు ముక్క‌లాట మొద‌లైంది…!

-

సాధారణంగా ప్రతి నియోజకవర్గంలో వివిధ పార్టీల మధ్య, అభ్యర్థుల మధ్య పోరు ఉంటుంది. ఒకే పార్టీలో రెండు గ్రూపుల మధ్య తగాదాలు ఉంటాయి. కానీ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం చాలా విచిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ఒకే పార్టీలో మూడు గ్రూపులు ఉన్నాయి. అది కూడా అధికార పార్టీ కావ‌డం విశేషం. అక్క‌డ వార్ మూడు పార్టీల మ‌ధ్య కాదు… అధికార పార్టీలోని మూడు గ్రూపుల మ‌ధ్యే స్టార్ట్ అయ్యింది. మ‌రి ఈ విచిత్ర‌మైన వార్ ఎక్క‌డ ? జ‌రుగుతుందో ? ఆ క‌థేంటో చూద్దాం.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ వైసీపీలో మూడు ముక్కలాట మొదలైంది. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి పక్క నియోజకవర్గానికి వెళ్లిన ప్రస్తుత మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు కూడా మంచి పట్టే ఉంది. ఇంకా చెప్పాలంటే బోస్‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రెండున్న‌ర ద‌శాబ్దాల అనుబంధం ఉంది. గ‌త ఎన్నికల‌కు ముందు జ‌గ‌న్ ఆయ‌న‌కు మండ‌పేట సీటు ఇవ్వ‌గా ఓడిపోయారు. అయితే జ‌గ‌న్ ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఉండ‌డంతో మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.

ఇక నాలుగుసార్లు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలతిచిన తోట త్రిమూర్తులుకు గట్టే పట్టే ఉంది. గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాల్లో రామ‌చంద్రాపురంలో గెలిస్తే బోస్ లేదా తోట త్రిమూర్తులే గెల‌వాలి అన్నంతంగా వీరిద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయాలు న‌డిచాయి. వీరిద్ద‌రి మ‌ధ్య అగ్గి లేకుండానే భ‌గ్గుమ‌నేది. ఇక ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన తోట‌పై చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ గెలిచారు. ఇప్పుడు తోట కూడా వైసీపీలో చేరిపోయారు. ఈ ముగ్గురిలో ఏ ఇద్ద‌రికి స‌రిప‌డే ప‌రిస్థితి లేదు.

ఐదునెలల క్రితం వరకు గురుశిష్యులుగా ఉన్న సుభాష్‌చంద్రబోస్‌, వేణుగోపాలకృష్ణ ఎన్నికల సమయంలోనూ ఇమడలేకపోయారు. బోసు నియోజవర్గంలో వేణు పాదం మోపడం ఆ వర్గానికి అస్సలు నచ్చలేదు. అందుకే వేణు ఓడిపోవాలని చూసినా జ‌గ‌న్ వేవ్ ముందు ఆయ‌న విజ‌యం సాధించారు. ఇక ఇప్పుడు ప‌రిస్థితులు మార‌డంతో వేణుకు వ్య‌తిరేకంగా తోట‌, బోస్ క‌లిసే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఏదేమైనా ప్ర‌స్తుతం ఈ ముగ్గురు నాయ‌కుల్లో ఎవ‌రికి వారే నియోజ‌క‌వ‌ర్గంలో ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తూ రాజ‌కీయాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news