టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో అతడు అడుగుపెడుతున్నాడంటే చాలు.. క్రికెట్ అభిమానుల అంచనాలు పెరిగిపోతాయి. అయితే, తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను కన్న కలల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు యువీ.ఒకప్పుడు తాను టెన్నిస్ ప్లేయర్ కావాలని అనుకున్నట్లు తెలిపాడు. చిన్నప్పుడు తన తండ్రి కొనిచ్చిన టెన్నిస్ రాకెట్‌ను విరిచేసిన సంఘనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తనకు కొత్తది కొనివ్వమని అడిగేందుకు చాలా భయపడినట్లు పేర్కొన్నాడు యువరాజ్.
ఫిట్నెస్ను కాపాడుకునేందుకు ఇప్పటికీ కనీసం రెండ్రోజులకు ఒకసారి టెన్నిస్ ఆడతానని చెప్పాడు యువరాజ్. రిటైర్మెంట్ తర్వాత కూడా క్రికెటర్లు, ఇతర ఆటగాళ్లు నిత్యం క్రీడల్లో పాల్గొనటానికి ఇష్టపడతారని అన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సచిన్ తనతో మాట్లాడుతూ.. “నాలుగైదు రోజులకు మించి క్రికెట్ ఆడకపోతే.. చాలా ఆందోళన చెందుతానని” చెప్పినట్లు యువరాజ్ వివరించాడు.యువరాజ్ సింగ్ తన కెరీర్ మొత్తంలో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.