చెర్నిహైవ్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణుల దాడిలో ఏడుగురు పౌరులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రష్యాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజా పరిణామాలకు ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
రష్యా జరిపిన ఈ ఉగ్రదాడిపై ఉక్రెయిన్ సైనికులు కచ్చితంగా ప్రతిస్పందిస్తారని.. జవాబు స్పష్టంగా ఉంటుందని స్వీడన్ పర్యటన ముగింపు సందర్భంగా జెలెన్‌స్కీ అన్నారు. రష్యా దాడి ఘటనలో గాయపడినవారి సంఖ్య 148కి చేరిందని చెర్నిహైవ్ వ్యాచెస్లావ్ చౌస్ వెల్లడించారు. విదేశీ పర్యటనల్లో భాగంగా జెలెన్‌స్కీ ఆదివారం నెదర్లాండ్స్ చేరుకున్నారు. డచ్ వైమానిక స్థావరంలో ఆ దేశ ప్రధాని మార్క్ రూట్‌తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.
మరోవైపు రష్యా సేనలు ఆదివారం ఉదయం కుపియాన్స్క్‌పై జరిపిన బాంబు దాడుల్లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని ఖర్కీవ్ గవర్నర్ ఒలేహ్ సినీహుబోవ్ చెప్పారు. మరో వైపు రష్యా కుర్స్క్ నగరంలోని రైల్వేస్టేషన్‌పై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఐదుగురు గాయపడినట్లు ప్రాంతీయ గవర్నర్ రోమన్ స్టార్వోయిట్ తెలిపారు.