‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని

-

 

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న పేద ప్రజల ఆరోగ్య రక్షణకై తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం  ప్రారంభించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలలో ఎంతమంది ప్రజలు ఉన్నారో.. ఆ మూడు దేశాల ప్రజలకు సమానంగా ఇక్కడ ఈ  పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని ప్రధాని అన్నారు.  ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ తరహా పథకం అమల్లోలేదని గుర్తుచేశారు. రానున్నరోజుల్లో వైద్య రంగంలో ఉన్నవారు ఈ పథకాన్ని బట్టి తమ తమ కొత్త పథకాలను తీసుకు వస్తారనే విశ్వాసం తనకుందని మోదీ చెప్పారు.

దేశ వ్యాప్తంగా ఉన్న  సుమారు 10.74 కోట్ల మంది లబ్దిదారులకు ప్రధాని ఫొటోలతో ఉన్న లేఖలను కేంద్ర ప్రభుత్వం పంపనుంది. లబ్ధిదారులు వారి ప్రాంతంలోని ఆసుపత్రుల్లో ఆరోగ్య సౌకర్యాలను పొందవ చ్చునని, ఖర్చు గురించి ఆందోళన చెందకుండా పూర్తి చికిత్స పొందవచ్చని ఆలేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఎవరు అర్హులు..
పట్టణాల్లో చెత్త వస్తువులను ఏరేవారు, బిక్షగాళ్లు, వీధి వ్యాపారులు, హాకర్లు, నిర్మాణ రంగ కార్మికులు, తాపీ పనివారు, పెయింటర్లు, వెల్డర్లు, సెక్యురిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులు తదితర వర్గాలకు చెందిన కనీస వేతన కూలీలు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. రాష్ర్టాల్లో అమలులో ఉన్న రాష్ట్రీయ స్వాస్థ బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై) పథకం లబ్ధిదారులకూ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news