కేజ్రివాల్‌ టెర్రిరిస్టా.. దేశభక్తుడా..? బీజేపీపై ఆప్‌ నేత సంజయ్‌సింగ్‌ ఫైర్‌

-

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య హోరాహోరి మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. బీజేపీ అయితే ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేసింది. ఏకంగా కేజ్రివాల్‌ టెర్రరిస్టు అంటూ మండిపడింది. ఎవరేం ఆరోపణలు చేసినా ప్రజలు మాత్రం తాము ఇవ్వదల్చుకున్న తీర్పు ఇచ్చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి మరోసారి భారీ విజయం కట్టబెట్టారు.

ఈ సందర్భంగా ఆప్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ బీజేపీ నేతల ఆరోపణలను తిప్పికొట్టారు. ఢిల్లీ ప్రజలు తమ బిడ్డ కేజ్రివాల్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకున్నారన్నారు. కేజ్రివాల్‌ను మీరు టెర్రిరిస్టు అంటే.. ఢిల్లీ ప్రజలు మాత్రం దేశభక్తుడని రుజువు చేశారని బీజేపీ నేతలను ఉద్దేశించి ఎద్దేవాచేశారు. ఈ ఎన్నికల ద్వారా ఢిల్లీ ప్రజలు విధ్వంస రాజకీయాలను తిరస్కరించారని, ఎవరైతే ప్రజలకోసం పనిచేస్తారో వారే రాజకీయాల్లో మిగులుతారనే సందేశం ఇచ్చారని సంజయ్‌సింగ్‌ పేర్కొన్నారు.

మంగళవారం వెల్లడైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఒంటిచేత్తో విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకుగాను ఆప్‌ 62 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ మాత్రం ప్రధాని సహా పెద్దపెద్ద నేతలందరూ ప్రచారం చేసినా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యింది. కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్‌ పార్టీకి 2015లో లాగే మరోసారి రిక్తహస్తం ఎదురైంది. ఆ పార్టీ ఒక్కస్థానంలో కూడా గట్టిపోటీ ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Latest news