జవాబుదారీతనమే కవాతు ప్రధాన ఉద్దేశం…పవన్
జనసేన అధినత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి కవాతు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి జనసైన్యంతో పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం కాటన్ విగ్రహం వరకూ రెండున్నర కిలోమీటర్ల మేర కవాతు చేయనున్నారు. కవాతుకు సంబంధించి ఆదివారం సాయంత్రం ‘పద పద పద’ అనే రామజోగయ్య శాస్త్రి రచించిన పాటను పవన్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. కవాతు అనంతరం కాటన్ విగ్రహం వద్ద జరగనున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు…వాహనాల్లో ప్రయాణం చేసి వచ్చే జనసైనికులు జాగ్రత్తగా రావాలని కోరారు. మోటారు వాహనాలపై వేగంగా ప్రయాణించే ముందు మీ కుటుంబ సభ్యులు, నన్ను గుర్తుపెట్టుకోండి అంటూ ట్విట్టర్ వేదికగా వారికి సూచనలు చేశారు. కవాతు నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ ముందుజాగ్రత్తగా పోలీసు బలగాలు, అంబులెన్స్ లని ఏర్పాటు చేశారు.
జనసేన పార్టీ(జేఎన్ పీ) ఫర్ న్యూ ఏజ్ పాలిటిక్స్ హ్యాష్ ట్యాగ్‌తో పవన్ కల్యాణ్ ట్వీట్లు చేశారు…ఈ సందర్భంగా ఇది తమ అధికారిక హ్యాష్ ట్యాగ్ అని పేర్కొన్నారు. ‘చట్టసభల సభ్యుల్లో జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ప్రయత్నించడమే కవాతు ప్రధాన ఉద్దేశం’ అని వివరించారు. 13 జిల్లాల నుంచి ఇప్పటికే వేలాదిగా జనసైనికులు రాజమండ్రి చేరుకున్నారు.