మధ్య ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి అమిత్ షా ఓటర్లకు వినూత్న హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే యూపీలోని అయోధ్య ఆలయ దర్శనానికి ఉచితంగా తీసుకెళ్తామన్నారు. ‘మీరు ఎలాంటి ఖర్చూ చేయాల్సిన అవసరం లేదు. దశలవారీగా మిమ్మల్ని అయోధ్యకు తీసుకెళ్తాం. మా ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని చేర్చాం’ అని షా వెల్లడించారు. కాగా ఈనెల 17న మధ్య ప్రదేశ్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జాతీయ నేతలంతా మోహరించి..ఊరూరా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే హోంమంత్రి అమిత్ షా అయోధ్య గురించి ప్రకటన చేశారు.
తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. రామ మందిర నిర్మాణ తేదీ ఎప్పుడని రాహుల్ గాంధీ పదేపదే అడిగేవారని అమిత్ షా తెలిపారు. 2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగుతుందని ఇప్పుడు చెబుతున్నా.. అంటూ ప్రసంగించారు. ఐతే వెంటనే అక్కడున్న ఓ బీజేపీ నేత స్పందిస్తూ.. అయోధ్య రామ మందిర దర్శనానికి తాము డబ్బులు పెట్టుకోవాలా? అని ప్రశ్నించారు. దానికి బదులిచ్చిన అమిత్ షా.. ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో బీజేపీని గెలిపిస్తే.. రాష్ట్ర ప్రజలకు అయోధ్య దర్శనాన్ని ఉచితంగానే కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను దశలవారీగా అయోధ్యకు తీసుకెళ్తామని చెప్పారు.