Real Estate రంగంలో కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కచ్చితంగా చాలా మోసపోతారు. లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటారు. ప్రీ లాంచ్ ఆఫర్లు రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద పెద్ద మోసాలకు కారణం అవుతున్నాయి.తక్కువకే వస్తాయని అలోచించి రూపాయి రూపాయి కూడబెట్టి కష్టపడి సంపాదించిన డబ్బుని అంతా రియల్ ఎస్టేట్ మోసగాళ్లకు పెట్టేస్తున్నారు మధ్యతరగతి ప్రజలు.
వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, హై రైజ్ ప్రీమియం అపార్టుమెంట్లు అంటూ.. స్క్వేర్ ఫీట్ కి రూ.4000కే అమ్ముతున్నట్లుగా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అంతేగాక మొత్తం డబ్బులు కూడా ఒకేసారి కట్టాలనే షరతు పెడుతున్నారు. కనీసం పునాదులు అనేవి కూడా ఉండవని రెండు, మూడేళ్లలో హ్యాండోవర్ చేస్తామని మాయ మాటలు చెబుతారు. అంతేగాక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తామని మాయ మాటలు చెబుతున్నారు. హైదరాబాద్ లాంటి ఇంటర్నేషనల్ సిటీలో సొంతిల్లు ఉండాలనే మధ్య తరగతి ప్రజలు ఎన్నో కలలు కంటూ ఉంటారు.
అలాంటి వారి కలను ఆసరాగా చేసుకొని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రీ లాంచ్ అఫర్ల పేరిట భారీ మోసాలని చేస్తున్నారు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే సమయంలోనే కొంత లేదా మొత్తం డబ్బు ఇస్తే ధర తగ్గుతుందనే ఉద్దేశంతో ఆశపడి ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. ఇటువంటి మోసాలు చేసినందుకు గాను హైదరాబాద్ సీసీఎస్‌లో ఇప్పటికే పలు సంస్థలపై కేసులు రిజిస్టర్ అయ్యాయి.
సాహితీ ఇన్‌ఫ్రా, భువనతేజ, జీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా కంపెనీలు వందల కోట్లు వసూలు చేసి జనాలను మోసం చేసి చివరకు బోర్డు తిప్పడం జరిగింది. ఈ కంపెనీలు వందల మందిని మోసం చేసి వారి సొంత ఇంటి కలను నాశనం చేశాయి.రెరా చట్టం అమల్లో ఉంది కాబట్టి రెరా నుంచి అనుమతి తీసుకున్నాకే ఎవరైనా ప్లాట్లు విక్రయించాలి. కాబట్టి జనాలు ఈ విషయాన్ని తెలుసుకున్నాకే ప్లాట్లు కొనాలి.