రాష్ట్ర అసెంబ్లీలో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రవేశ పెట్టిన ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ కి సభ ఆమోదయోగ్యం తెలిపింది. ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రైవేట్ రంగాల్లో యువతకు అత్యుత్తమ నైపుణ్య శిక్షణ ఇప్పించడం ద్వారా మరో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం కోసం రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులు లక్షల్లో ఉన్నప్పటికీ వారికి సరైన నైపుణ్యాలు ఉండటం లేదని, దీనివల్ల అవకాశాలు ఉన్నా వారు అందిపుచ్చుకోవడంలో వెనకబడుతున్నారని అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది నుంచి ప్రతి గ్రాడ్యూయేట్ తప్పనిసరిగా ఇంటర్నిప్, అప్రెంటిషిప్ చేసి వారి చదువుతోపాటు ఉద్యోగానికి అవసరమయ్యే స్కిల్స్ పెంపొందించునే విధంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీలో అన్ని కోర్సులు ప్రాక్టికల్ కాంపొనెంట్ కలిగి ఉంటాయని, ఇప్పటికే ఈ విషయం మీద వీసీలు, విద్యార్థులతోపాటు, పారిశ్రామిక వేత్తలతో కూడ చర్చించామని అన్నారు. ప్రస్తుతానికి ఈ నైపుణ్య శిక్షణలను ప్రయోగాత్మకంగా హైదరాబాద్కు మాత్రమే వర్తింపజేసి, తర్వాత అన్ని జిల్లాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ప్రయోగం సక్సెస్ అయితే రాష్ట్రానికి మరిన్ని భారీ పరిశ్రమలు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటయ్యే ఈ యూనివర్సిటీకి ముచ్చర్లలో శాశ్వత క్యాంపస్ నిర్మించబోతున్నట్టు మంత్రి తెలియజేశారు. అనంతరం స్పీకర్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.