ఆ పనికి తోడు కోసం సీల్స్‌ చప్పట్లు కొడుతాయట!

-

‘సీల్‌’. ఈ పేరు మీరెప్పుడైనా విన్నారా? ఇది ఒక రకమైన సముద్ర జీవి. వీటిలో బూడిదరంగు సీల్స్‌ (గ్రే సీల్స్‌) గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది. ఇవి పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. మగ జీవి 150 నుంచి 300 కిలోల బరువుతో రెండున్నర మీటర్ల వరకు, ఆడ జీవి 100 నుంచి 200 కిలోల బరువుతో రెండు మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. వీటి దేహం కింది భాగంలో ముందువైపు ఒక జత, వెనుకవైపు ఒక జత వేళ్లు లేని తెడ్లలాంటి పాదాలు ఉంటాయి. నీటిలో ఈదడానికి తోడ్పడే ఈ పాదాలను ఈ గ్రే సీల్స్‌ మరో పనికి కూడా ఉపయోగిస్తాయని ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం ఇటీవలే కనిపెట్టింది. అదేంటంటే చప్పట్లు కొట్టడం. మరి ఈ చప్పట్ల వెనుక సంగతేందో తెలుసుకుందామా?

సాధారణంగా జంతుప్రదర్శన శాలల్లోని నీటిలో ఉండే సీల్స్‌ చప్పట్లు కొడుతాయి. సందర్శకుల ఆనందం కోసం జూ నిర్వాహకులు ఇచ్చిన శిక్షణతో వాటికి ఆ చప్పట్లు కొట్టడం అనే లక్షణం ఒంటబడుతుంది. అది కూడా నీటిపైకి వచ్చి అవి చప్పట్లు కొడుతాయి. ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. కానీ ఎలాంటి శిక్షణ లేకపోయినా సముద్రాల్లో ఉండే సీల్స్‌ కూడా చప్పట్లు కొడుతాయట. అదీ నీటి లోపలిభాగంలో ఎలాంటి గాలి లేకపోయినా, తుపాకీ పేలినంత పెద్దగా శబ్దం వచ్చేలా చప్పట్లు కొడుతాయట. జూలల్లో ఉండే సీల్స్ సందర్శకుల ఆనందం కోసం చప్పట్లు కొడుతాయి, మరి సముద్రాల్లో ఉండే సీల్స్‌ ఎందుకు చప్పట్లు కొడుతాయనే ప్రశ్నకు ఆసక్తికరమైన జవాబిచ్చారు మోనాష్‌ యూనివర్సిటీ పరిశోధకులు.

 

అదేందంటే.. సాధారణంగా గ్రే సీల్స్‌ సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి రకరకాల శబ్దాలు చేస్తాయట. అయితే ఈ చప్పట్లు కొట్టడం అనే లక్షణం కూడా కమ్యూనికేషన్‌ కోసమే అయినా దీన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్రదర్శిస్తాయట. అదేనండి ఆడ సీల్‌తో ఏకాంతంగా కలుసుకునే సమయంలో మగ సీల్‌ ఇలా చప్పట్లు కొడుతుందట. ఈ చప్పట్ల ద్వారా మగ సీల్‌ తన పరిసరాల్లో ఉన్న సీల్స్‌కు రెండు రకాల సందేశాలిస్తుందట. అందులో మొదటిది.. ‘నేను చాలా బలవంతుడిని, నా దరిదాపుల్లోకి ఎవరూ రావద్దు’ అని. తాను ఆడ సీల్‌ను సమీపించడానికి ముందే దాని చుట్టుపక్కల నక్కి ఉన్న ఇతర మగ సీల్స్‌ను భయపెట్టడానికి అలా చేస్తుందట. రెండోది.. ‘నేను చాలా బలవంతుడిని, నాలో చాలా చక్కని జీన్స్‌ ఉన్నాయి’ అని. నీతో సంగమానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ ఆడ సీల్‌ను ఆకర్షించడానికి ఇలా చేస్తుందట. ఇలా మగ సీల్‌ చప్పట్ల శబ్దం వినగానే దానికంటే బలహీనంగా ఉండే ఇతర మగ సీల్స్‌ అక్కడి నుంచి పారిపోతాయట. ఆడ సీల్ వచ్చి తన సరసన చేరుతుందట.

చప్పట్లు కొట్టడం అనేది గ్రే సీల్స్‌లో అతి ముఖ్యమైన సామాజిక ప్రవర్తన అంటున్నారు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డా. డేవిడ్‌ హాకింగ్‌. ఇది సీల్స్‌ జాతి అంతరించిపోకుండా ఉండటానికి తోడ్పడుతుందని ఆయన చెబుతున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏందంటే.. గ్రే సీల్ చప్పట్లు కొట్టే దృశ్యాన్ని తన కెమెరాలో బంధించడం కోసం బ్రిటన్‌కు చెందిన ప్రకృతి ప్రేమికుడు డా. బెన్‌ బర్విల్లే 17 ఏండ్లు శ్రమించాల్సి వచ్చిందట. ఇదండీ సీల్స్‌ చప్పట్ల సంగతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version