అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో పనిచేస్తున్న నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (జేపీఎల్) సైంటిస్టులు అక్కడ కొత్త రకం బాక్టీరియాను గుర్తించారు. స్పేస్ స్టేసన్ లో సేకరించిన శాంపిల్స్ ను పరీక్షించిన అనంతరం వారు ఆ నూతన బాక్టీరియాను కనుగొన్నారు. మొత్తం 4 రకాల బాక్టీరియాను వారు కనుగొనగా.. అందులో ఒక బాక్టీరియా పాత రకం బాక్టీరియాను పోలి ఉండగా, మిగిలిన 3 బాక్టీరియా కొత్తవి కావడం విశేషం.
కస్తూరి వెంకటేశ్వరన్, నితిన్ కుమార్ సింగ్ అనే శాస్త్రవేత్తలు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో పనిచేస్తూ సదరు బాక్టీరియాను గుర్తించారు. ఆ బాక్టీరియా Methylobacteriaceae కుటుంబానికి చెందినవని వారు తెలిపారు. ఈ క్రమంలోనే కొత్త బాక్టీరియాకు భారత జీవవైవిధ్య సైంటిస్టు డాక్టర్ అజ్మల్ ఖాన్ పేరిట Methylorubrum ajmalii అని నామకరణం చేశారు.
అయితే ఈ కొత్త బాక్టీరియా విప్లవాత్మక మార్పులకు కారణం అయ్యే అవకాశం ఉందని సైంటిస్టులు తెలిపారు. దీని వల్ల వ్యాధులతో మరింత సమర్థవంతంగా పోరాడే అవకాశం ఉంటుందని, అలాగే అంగారక గ్రహంపై పంటలను పండించేందుకు ఈ బాక్టీరియా దోహదం చేయవచ్చని వారు అభిప్రాయపడ్డారు.
కాగా రష్యా, జపాన్, కెనడా, ఐరోపా దేశాలు నాసాతో కలిసి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాయి. ఈ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ నిర్దష్టమైన కక్ష్యలో తిరుగుతుంటుంది. ఇందులో సైంటిస్టులు పనిచేస్తుంటారు. వారికి కావల్సిన అన్ని వసతులు, ల్యాబ్‌లు అందులో ఉంటాయి.