కరోనాతో టైప్‌-1 డయాబెటిస్‌.. సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడి..!

కరోనాతో బాధపడుతున్న పేషెంట్లకు ఇది నిజంగా చేదువార్తే. ఎందుకంటే.. కరోనా వచ్చిన వారు టైప్‌-1 డయాబెటిస్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌, ఆస్ట్రేలియా మోనాష్‌ యూనివర్సిటీ, లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌, జర్మనీలోని టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డ్రెస్డెన్‌, సింగపూర్‌ నన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలకు చెందిన పలువురు పరిశోధకులు న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఎడిటర్‌కు రాసిన ఓ లేఖలో ఈ వివరాలను వెల్లడించారు.

covid 19 may trigger type 1 diabetes say scientists

జర్మనీలో ఫిన్‌ నాడ్ట్‌ అనే ఓ 18 ఏళ్ల యువకుడికి కరోనా వచ్చి తగ్గింది. అయితే తరువాత అతనికి టైప్‌-1 డయాబెటిస్‌ లక్షణాలు మొదలయ్యాయి. విపరీతమైన దాహం వేయడం ప్రారంభమైంది. చెక్‌ చేస్తే అది టైప్‌-1 డయాబెటిస్ అని నిర్దారణ అయింది. దీంతో అతనికి అంతకు ముందు సోకిన కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ మూలంగానే టైప్‌-1 డయాబెటిస్‌ వచ్చి ఉంటుందని సైంటిస్టులు మొదట్లో భావించారు. తరువాత పరిశోధనల అనంతరం ఆ విషయం నిజమే అని నిర్దారించారు.

కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే వారిలో శరీర రోగ నిరోధక వ్యవస్థకు చెందిన కణాలు క్లోమగ్రంథిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా సెల్స్‌పై దాడి చేస్తాయి. దీని వల్ల ఆ బీటా కణాలు చనిపోతాయి. ఫలితంగా క్లోమగ్రంథి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేదు. దీంతో ఇన్సులిన్‌ ఉత్పత్తి ఆగిపోతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు పెరుగుతాయి. దీన్ని టైప్‌-1 డయాబెటిస్‌ అని పిలుస్తారు. అయితే కోవిడ్‌ బారిన పడే ప్రతి ఒక్కరిలోనూ ఇలా జరిగే అవకాశం లేదని సైంటిస్టులు అంటున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాలని వారంటున్నారు.