Agni Prime Missile : ‘అగ్ని-ప్రైమ్‌’ క్షిపణి ప్రయోగం విజయవంతం

-

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కొత్తతరం మధ్యంతర శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-ప్రైమ్‌ను భారత్‌ శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరం వెంబడి ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి సంచార లాంచర్‌ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. ఘన ఇంధనంతో పనిచేసే ఈ అస్త్రంలోని అన్ని వ్యవస్థలూ నిర్దేశించిన రీతిలో పనిచేశాయని డీఆర్‌డీవో వర్గాలు తెలిపాయి. ప్రయోగానికి సంబంధించిన లక్ష్యాలన్నీ నెరవేరాయని వెల్లడించాయి. ఇందులోని గమనాన్ని రాడార్లు, టెలిమెట్రీ సాధనాలు, బంగాళాఖాతంలో మోహరించిన యుద్ధ నౌకలు నిశితంగా పరిశీలించాయని వివరించాయి.

ఈ క్షిపణి గరిష్ఠంగా 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అస్త్రాన్ని చివరిసారిగా గత ఏడాది డిసెంబరు 18న పరీక్షించామని.. అణ్వస్త్రాన్ని మోసుకెళ్లే సామర్థ్యమున్న అగ్ని-ప్రైమ్‌లో రెండు అంచెలు ఉంటాయని వెల్లడించారు. దీర్ఘకాలం నిల్వ చేయడానికి, సులువుగా ప్రయోగించడానికి వీలుగా ఈ క్షిపణిని గొట్టపు ఆకృతి (క్యానిస్టర్‌)లో అమర్చారు. అందువల్ల దీన్ని ఎక్కడికైనా తేలిగ్గా రవాణా చేయవచ్చు. అవసరాన్ని బట్టి రైలు లేదా రోడ్డుపై నుంచి ప్రయోగించవచ్చు. అగ్ని తరగతి అస్త్రాలన్నింటిలోకీ ఇదే అత్యంత తేలికైంది. అగ్ని-3 క్షిపణితో పోలిస్తే దీని బరువు సగమే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news