అందమైన దృశ్యాలను, మధురమైన క్షణాలను క్లిక్ మనిపించాలంటే కావాల్సింది కెమెరా. ఇటీవలి కాలంలో ఫొటోషూట్లు, వీడియో ఎడిటింగ్లపై యువత ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. ఫలితంగా వీటి వినియోగం బాగా ఎక్కువైంది. వారిని ఆకట్టుకోడానికి సోనీ సంస్థ సరికొత్త కెమెరాను మార్కెట్లోకి తెస్తోంది. ఆ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
కెమెరా.. సాంకేతిక వినియోగం పెరిగాక యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్న గ్యాడ్జెట్లలో ఇదీ ఒకటి. చాలా మంది వీడియో ఎడిటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. యూట్యూబ్ సహా పలు సోషల్ మీడియా సైట్లలో తమ క్రియేటివిటీతో వీడియోలు చేయడానికి కెమెరా ఓ ఆయుధంగా మారింది. అలాంటి వారిని ఆకట్టుకోడానికి సోనీ మరో ఫుల్ ఫ్రేమ్ మిర్రర్ లెస్ కెమెరాను తీసుకొస్తోంది. న్యూ ఆల్ఫా 7ఎస్-III పేరిట దీన్ని విడుదల చేయనుంది. ఇది ఫుల్ ఫ్రేమ్‌తో మిర్రర్ లెస్‌గా ఉండనుంది. అల్ట్రా హై సెన్సిటివిటీ, బియోన్జ్ ఇమేజ్ ప్రాసెసర్ దీని ప్రత్యేకతలు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ధర రూ.2,61,915.
బియోన్జ్ ఎక్స్ఆర్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఇంజిన్ వల్ల ఎనిమిది రెట్ల వేగంతో ప్రాసెసింగ్.12.1 మెగాపిక్సెల్ సహా ఫుల్‌ఫ్రేమ్ ఎక్స్మోర్ ఆర్ సీమాస్ ఇమేజ్ సెన్సార్ దీని సొంతం.అల్ట్రా హై సెన్సిటివిటీతో పాటు ఐఎస్ఓ రేంజ్ 40 నుంచి 409,600కు పెంచుకొనే సౌలభ్యం.సినిమాల కోసం 15+ డైనమిక్ రేంజ్ సదుపాయం.4కే 60 పిక్సెల్ 16 బిట్ వీడియోను హెచ్డీఎమ్ఐలో ఔట్పుట్ తెచ్చుకోవచ్చు. ఆల్ఫా సిరీస్‌లో తొలిసారి ఈ సదుపాయం కల్పిస్తోంది సోనీ.