ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా ఈ నెలలో ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలియజేసింది. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో యాపిల్ కొత్త ఐఫోన్లు, వాచ్ సిరీస్‌లను విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగానే ఈసారి కూడా నూతన ఉత్పత్తులను విడుదల చేయనుంది.
యాపిల్ సంస్థ సెప్టెంబర్ 14వ తేదీన ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ఆహ్వానాలను పంపించింది. అయితే ఆ ఈవెంట్‌లో ఐఫోన్ 13 ఫోన్లతోపాటు వాచ్ సిరీస్ 7 వాచ్‌లను విడుదల చేస్తుందని తెలుస్తోంది. కోవిడ్ కారణంగా గతేడాది వర్చువల్‌గానే ఈవెంట్‌ను నిర్వహించారు. దీంతో ఇప్పుడు కూడా యాపిల్ అలాగే ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్లాన్ వేస్తోంది.
యాపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 14వ తేదీన భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభం కానుంది. అందులో యాపిల్ కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ 13తోపాటు యాపిల్ వాచ్ సిరీస్ 7 వాచ్‌లు, మాక్‌బుక్ ప్రొ లు, ఎయిర్ పాడ్స్ ను విడుదల చేస్తారని సమాచారం.
ఇక ఐఫోన్ 13 ఫోన్లలో అద్బుతమైన ఫీచర్లను యాపిల్ అందించనున్నట్లు తెలుస్తోంది. 5.4, 6.1, 6.7 ఇంచుల డిస్‌ప్లే సైజ్ లలో ఐఫోన్ 13ను విడుదల చేస్తారని సమాచారం. ఐపోన్ 13, 13 ప్రొ, 13 ప్రొ మ్యాక్స్ పేరిట ఫోన్లను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. వాటిల్లో యాపిల్ ఎ15 చిప్, 5జి, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ వంటి అద్బుతమైన ఫీచర్లు ఉంటాయని సమాచారం.