యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లు అంటే చాలా ఖరీదు ఉంటాయి. అందువల్ల ఆ కంపెనీకి చెందిన కొత్త ఐఫోన్లను కొనేందుకు కేవలం తక్కువ శాతం మందే ఆసక్తిని చూపిస్తుంటారు. కానీ వాడిన ఐఫోన్ల ఖరీదు తక్కువగా ఉంటుంది. అలాగే వాటికి లైఫ్ ఎక్కువగా ఉంటుంది కనుక ఐఫోన్లను సెకండ్ హ్యాండ్‌లో ఎక్కువగా కొంటుంటారు. ఈ క్రమంలో ఐఫోన్లను సెకండ్ హ్యాండ్‌లో కొనేటప్పుడు కింద తెలిపిన విషయాలను ఒక్కసారి పరిశీలించాల్సి ఉంటుంది. అవేమిటంటే…
* ఐఫోన్‌లకు యాపిల్ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే మీకు సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ను అమ్మేవారిని ఫోన్ మొత్తాన్ని రీసెట్ చేసి ఇవ్వమనాలి. అలాగే ఫోన్ కొనేటప్పుడు వారి ఎదుటే మీ యాపిల్ ఐడీని సెటప్ చేసుకోవాలి. ఏ ఇబ్బంది లేకుండా సెటప్ జరిగితే. లేదంటే ఫోన్‌ను తీసుకోరాదు. ఎందుకంటే కొందరు దొంగతనం చేయబడిన ఐఫోన్లను విక్రయిస్తారు. కనుక అలా జరగకుండా ఉండాలంటే ఫోన్ ను కొనే కన్నా ముందే యాపిల్ ఐడీని సెటప్ చేయాలి. నిజంగా ఆ ఫోన్ వారిదే అయితే యాపిల్ ఐడీని ఎరేజ్ చేయడం, సెటప్ చేయడం ఇబ్బంది కాదు. అదే ఫోన్ వారిది కాకపోతే.. అంటే దొంగిలించబడింది అయితే యాపిల్ ఐడీని తీసేసి మళ్లీ సెటప్ చేయడం సాధ్యం కాదు. దీంతో మీరు కొనే ఐఫోన్ అసలుదా, దొంగతనం చేయబడినదా.. అనే విషయం సులభంగా తెలిసిపోతుంది.
* ప్రస్తుతం చాలా వరకు ఐఫోన్లలో వాటర్ ప్రొటెక్షన్ లభిస్తోంది. అయితే సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ను కొనేటప్పుడు ఆ ఫోన్ నీటిలో తడిసిందా, లేదా అనే విషయం చెక్ చేయాలి. అందుకు గాను ఫోన్ సిమ్ ట్రేని తెరచి చూడాలి. అందులో ఎరుపు రంగు స్ట్రిప్ కనిపిస్తే ఫోన్ నీటిలో తడిచినట్లు లెక్క. దీంతో ఆ ఫోన్‌ను కొనకూడదు.
* సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ను కొనేటప్పుడు అందులో బ్యాటరీ హెల్త్ ఏవిధంగా ఉందో పరిశీలించాలి. ఫోన్‌ను కొన్న తరువాత సహజంగానే కాలం గడిచే కొద్దీ బ్యాటరీ పనితనం తగ్గుతుంది. అందువల్ల ఫోన్‌లోని సెట్టింగ్స్‌లో ఉండే బ్యాటరీ ఆప్షన్‌లోకి వెళ్లి అక్కడ బ్యాటరీ హెల్త్ ఎంత మేర ఉందో పరిశీలించాలి. కనీసం 80 శాతం హెల్త్ ఉంటే ఓకే. అంతకన్నా తక్కువగా బ్యాటరీ హెల్త్ ఉంటే ఆ ఐఫోన్‌ను కొనరాదు. కొన్నా వెంటనే బ్యాటరీ సమస్యలు వస్తాయి. కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి.
* ఐఫోన్లలో 3డి టచ్ ఫీచర్ ఉంటుందనే విషయం తెలిసిందే. స్క్రీన్‌పై లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే 3డి టచ్ ఫీచర్‌ను పొందవచ్చు. ఏదైనా యాప్ ఐకాన్ మీద అలా ప్రెస్ చేసి పట్టుకుంటే దానికి సంబంధించిన ఫీచర్లను వాడుకోవచ్చు. అయితే ఫోన్ డిస్‌ప్లే సమస్య ఉంటే 3డి టచ్ సరిగ్గా పనిచేయదు. 3డి టచ్ సరిగ్గా పనిచేస్తుందో, లేదో చెక్ చేస్తే ఫోన్ డిస్‌ప్లే సమస్య ఉందో, లేదో తెలుస్తుంది. దీంతో డిస్‌ప్లే సమస్య లేని ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
* ఐఫోన్‌కు చెందిన బాక్స్ తోపాటు అందులోని యాక్ససరీలు.. అంటే కేబుల్, చార్జర్, ఇయర్ ఫోన్స్, బిల్ తదితర సామగ్రి ఉంటే ఇంకా మంచిది. దీంతో యాపిల్ ద్వారా సపోర్ట్ పొందడం మరింత తేలికవుతుంది.
సెకండ్ హ్యాండ్ ఐఫోన్లను కొనేవారు ఈ విషయాలను ఒకసారి తెలుసుకుని ఆ తరువాత ఫోన్లను కొంటే చక్కని ఫోన్‌లను ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీని వల్ల ఫోన్లు ఎక్కువ కాలం మన్నుతాయి.