ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు చెందిన గూగుల్ అసిస్టెంట్ google assistant అనేక డివైస్‌లలో అందుబాటులో ఉన్న విషయం విదితమే. ఫోన్లు, ట్యాబ్‌లు, స్మార్ట్ టీవీల్లో ప్రస్తుతం గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ లభిస్తోంది. దీని సహాయంతో గూగుల్‌లో మనం వాయిస్ కమాండ్లతో ఏదైనా వెదకవచ్చు. అయితే దీని గురించి ఓ షాకింగ్ విషయం బయట పడింది.
గూగుల్ అసిస్టెంట్‌ను యూజర్లు వాడినా, వాడకపోయినా వారు మాట్లాడే మాటలను రికార్డు చేస్తున్నామని, అయితే అన్ని సందర్భాల్లోనూ అలా చేయమని, సాధారణ సంభాషణలు మాత్రమే రికార్డు చేస్తామని గూగుల్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు వారు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరై ఆ విధంగా వివరణ ఇచ్చారు. అయితే ప్రజలు చేసే సంభాషణల్లో సాధారణమైనవి ఏవి, సున్నితమైన సంభాషణలు ఏవి ? అన్న దానిపై వారు స్పష్టతనివ్వలేదు.
గూగుల్ అసిస్టెంట్ తో ఓకే గూగుల్ అని సంభాషణ మొదలు పెడితే కొన్ని మాటలను రికార్డు చేస్తామని గూగుల్ ప్రతినిధులు తెలిపారు. ఇక కమిటీ సభ్యుల్లో ఒకరైన బీజేపీ ఎంపీ నిశాంత్ దూబే గూగుల్ ప్రతినిధులను ప్రశ్నించారు. గూగుల్ అసిస్టెంట్‌ను వాడకపోయినా యూజర్ల సంభాషణలను రికార్డు చేస్తారా ? అని అడగ్గా.. అందుకు గూగుల్ ప్రతినిధులు అవుననే సమాధానం ఇచ్చారు. దీంతో ప్రజలకు డిజిటిల్ ప్రపంచంలో లభిస్తున్న ప్రైవసీపై మరోమారు అనుమానాలు నెలకొన్నాయి. అయితే దీనిపై కేంద్రం ఏమని స్పందిస్తుందో చూడాలి.