ఇంటర్నెట్ ఎక్కువ ఆపేసే దేశాల్లో భారత్ ఫస్ట్…!

-

కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు, అల్లర్లను అరికట్టడానికి గాను ఇంటర్నెట్ సేవలు ఆపేసిన కేంద్రం. గత రెండేళ్ళు గా ఈ వార్తలు ఎక్కువగా చదువుతున్నారు జనం. జమ్మూ కాశ్మీర్ లో నిత్యం ఏదోక సంఘటన జరగడం అక్కడ రోజుల తరబడి ఇంటర్నెట్ ని ఆపేయడం మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా ఏ పనీ జరిగే పరిస్థితి లేదు. దీనితో ఇంటర్నెట్ సేవలను ఆపేయడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లుపై,

దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పరిస్థితి చాలా వరకు దారుణంగా ఉంది. దీనితో అక్కడ కూడా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా దీనిపై ఒక నివేదికను బయట పెట్టారు. ఇంట‌ర్‌నెట్ అడ్వొకసీ గ్రూప్ యాక్సెస్ నౌ తెలిపిన వివరాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 2018 నాటికి నమోదు అయిన ఇంటర్నెట్ షట్ డౌన్ లో భారత్ అగ్ర భాగాన ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా 67 శాతం భారత్ లోనే నమోదు అయింది. 2012 జనవరి నుంచి భారత్ లో 373 సార్లు అంతర్జాల సేవలు నిలిచిపోయాయని, సాఫ్ట్‌వేర్ ఫ్రీడం అండ్ లా సెంటర్ తాజాగా పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ లో 180 సార్లు ఇంటర్నెట్ సేవలు ఆగిపోయాయి. దేశ వ్యాప్తంగా నమోదు అయిన దాంట్లో ఇది సగంగా ఉంది. అయితే అంతర్జాలం విషయంలో అన్ని రకాలుగా నియంత్రణ విధించే చైనా, ఉభయ కోరియా దేశాలకు సంబంధించి ఏ వివరాలు వెల్లడి కాలేదు. కర్ణాటక లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు ఆపేశారు.

Read more RELATED
Recommended to you

Latest news