దేశీయ మొబైల్స్ తయారీదారు మైక్రోమ్యాక్స్ గతేడాది నవంబర్‌లో రెండు నూతన స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టి మళ్లీ స్మార్ట్ ఫోన్ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే. మైక్రోమ్యాక్స్ లాంచ్ చేసిన నోట్ 1, ఇన్1బి ఫోన్లు తక్కువ ధరలను కలిగి ఉండడమే కాదు, వినియోగదారులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రధాని మోదీ ఆత్మనిర్భర కార్యక్రమాన్ని ప్రకటించిన నేపథ్యంలో మైక్రోమ్యాక్స్ సరికొత్త డిజైన్‌తో మళ్లీ మార్కెట్‌లోకి ప్రవేశించింది.
అయితే ఇకపై రానున్నది 5జి యుగం కనుక కంపెనీలన్నీ 5జీ ఫోన్లను తయారు చేసి అందివ్వడానికి సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే పలు కంపెనీలు 5జీ ఫోన్లను విడుదల చేశాయి. అయితే మిడ్ రేంజ్ వరకు ధరలలో అవి అందుబాటులో ఉన్నాయి. కానీ బడ్జెట్ ధరలో 5జి ఫోన్‌ను ఇప్పటి వరకు ఏ కంపెనీ విడుదల చేయలేదు. అయితే మైక్రోమ్యాక్స్ ఆ ప్రయత్నం చేయనుంది. త్వరలోనే ఆ కంపెనీ నుంచి తక్కువ ధరకే 5జి ఫోన్ విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ వెల్లడించారు.
ఇటీవలే యూట్యూబ్‌లో ఓ చానల్ వారు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన త్వరలో రానున్న మైక్రోమ్యాక్స్ ప్రొడక్ట్స్ గురించి తెలిపారు. ఈ క్రమంలోనే అతి త్వరలో బడ్జెట్ 5జి ఫోన్‌ను విడుదల చేస్తామని తెలిపారు. అలాగే 6జీబీ ర్యామ్, బెటర్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే కలిగిన మరో ఫోన్‌ను, ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ను కూడా లాంచ్ చేస్తామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో మైక్రోమ్యాక్స్ ఆ 5జి ఫోన్ ను ఎప్పుడు విడుదల చేస్తుందా.. అని యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీలైనంత త్వరగా ఆ ఫోన్‌ను లాంచ్ చేస్తే బడ్జెట్ ధరకు లభించే ఏకైక 5జి ఫోన్ గా ఆ ఫోన్ రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.