ఇక నోకియా ల్యాప్‌టాప్‌లు.. త‌క్కువ ధ‌ర‌ల‌కే, త్వ‌ర‌లో అందుబాటులోకి..?

నోకియా కంపెనీ ఫోన్ల త‌యారీకి ప్ర‌సిద్ధిగాంచింది. ఒక‌ప్పుడు సెల్‌ఫోన్ మార్కెట్‌లో నోకియా అగ్ర‌స్థానంలో ఉండేది. ఇక ఇప్పుడు కూడా నోకియా ఫోన్లు వ‌స్తూనే ఉన్నాయి. కానీ త్వ‌రలో ఆ కంపెనీ ల్యాప్‌టాప్‌ల‌ను కూడా విడుద‌ల చేస్తుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా నోకియా తాను విడుద‌ల చేయ‌బోయే ల్యాప్‌టాప్‌ల‌కు బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (బీఐఎస్‌) స‌ర్టిఫికేష‌న్‌ను కూడా పొందింది.

nokia may launch intel core i3 and i5 laptops very soon in india

మొత్తం 9 సిరీస్‌ల‌కు చెందిన ల్యాప్‌టాప్‌ల‌కు గాను నోకియా బీఐఎస్ స‌ర్టిఫికేష‌న్‌ను పొందింది. వాటిల్లో కొన్నింటికి ఐ3 అని, కొన్నింటికి ఐ5 అని పేర్లు ఉన్నాయి. అందువల్ల ఇంటెల్ కోర్ ఐ3, ఐ5 ప్రాసెస‌ర్ల‌తో స‌ద‌రు ల్యాప్‌టాప్ లు వ‌స్తాయ‌ని తెలుస్తోంది. అయితే ఈ వివ‌రాలు బీఐఎస్ వెబ్‌సైట్ ద్వారా తెలిశాయి. కానీ నోకియా అధికారికంగా స‌ద‌రు ల్యాప్‌టాప్‌ల‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. కానీ త్వ‌ర‌లోనే ఆ ల్యాప్‌టాప్‌లు భార‌త్‌లో విడుద‌ల‌వుతాయ‌ని తెలుస్తోంది.

ఇక స‌ద‌రు ల్యాప్‌టాప్‌ల‌ను చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే నోకియా అందించ‌నున్న‌ట్లు స‌మాచారం. అందువ‌ల్ల ఐ3, ఐ5 సిరీస్‌లో ల్యాప్‌టాప్‌ల‌ను త‌యారు చేస్తున్న‌ట్లు తెలిసింది. చైనాకు చెందిన టాంగ్‌ఫాన్ లిమిటెడ్ అనే కంపెనీ ఆ ల్యాప్‌టాప్‌ల‌ను ఉత్పత్తి చేస్తోంది. అయితే ఇప్ప‌టికే ల్యాప్‌టాప్ మార్కెట్‌లో లెనోవో, డెల్‌, హెచ్‌పీ, అసుస్‌, ఏస‌ర్ వంటి కంపెనీలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. వాటికి తోడు ఈ మ‌ధ్యే షియోమీ కూడా కొన్ని ల్యాప్‌టాప్‌ల‌ను విడుదల చేసింది. మ‌రి నోకియా విడుద‌ల చేసే ల్యాప్‌టాప్‌లు ఆక‌ట్టుకుంటాయో, లేదో.. వేచి చూస్తే తెలుస్తుంది.