వారెవ్వా.. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు భ‌లే డిమాండ్‌.. తొలి రోజే రూ.600 కోట్ల‌కు ఆర్డ‌ర్లు..

ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఓలా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గ‌త నెల‌లో ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరిట రెండు నూత‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను భార‌త మార్కెట్‌లో లాంచ్ చేసింది. అయితే ఈ స్కూట‌ర్లు వాహ‌న‌దారుల‌కు ఎంత‌గానో న‌చ్చాయి. దీంతో బుధ‌వారం ఆర్డ‌ర్లు ప్రారంభం అయిన తొలి రోజే ఏకంగా రూ.600 కోట్ల‌కు ఆర్డ‌ర్లు వ‌చ్చాయి.

ola-electricl
ola-electricl

ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రొ స్కూట‌ర్‌ల‌కు గాను 80వేల బుకింగ్స్ జ‌రిగాయి. బుధ‌వారం ఉద‌యం 8 గంటల నుంచి ఓలా వెబ్‌సైట్‌లో బుకింగ్స్‌ను ప్రారంభించారు. దీంతో తొలి 12 గంట‌ల్లోనే 80వేల‌కు పైగా ఆర్డ‌ర్లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో మొత్తం బుకింగ్స్ వివ‌రాలు తెలియాల్సి ఉంది.

బుకింగ్స్ ప్రారంభ అయ్యాక ప్ర‌తి 4 సెక‌న్ల‌కు ఒక‌రు ఒక స్కూట‌ర్‌ను బుక్ చేశార‌ని ఓలా తెలియ‌జేసింది. ఈ మేర‌కు ఓలా ఎల‌క్ట్రిక్ సంస్థ సీఈవో భ‌వీష్ అగ‌ర్వాల్ ట్విట్ట‌ర్ ద్వారా పై వివ‌రాల‌ను వెల్ల‌డించారు. తొలి రోజే రూ.600 కోట్ల‌కు పైగా విలువైన ఆర్డ‌ర్లు వ‌చ్చాయ‌ని తెలిపారు.

ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో దేశంలోని 400 న‌గ‌రాల్లో 1 ల‌క్ష‌కు పైగా చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు భ‌వీష్ తెలిపారు. వీటి వ‌ల్ల సుల‌భంగా స్కూట‌ర్ల‌ను చార్జింగ్ పెట్టుకునేందుకు వీలు క‌లుగుతుంది. ఇప్పుడు బుకింగ్స్ చేసుకున్న వారికి అక్టోబ‌ర్‌లో ద‌స‌రా వ‌ర‌కు డెలివ‌రీ అందిస్తామ‌ని, తొలి విడ‌త‌లో 60వేల యూనిట్స్ ను డెలివ‌రీ చేస్తామ‌ని తెలిపారు. కాగా ఓలా ఎస్‌1 ధ‌ర రూ.99,999 ఉండ‌గా, ఎస్‌1 ప్రొ ధ‌ర రూ.1,29,999గా ఉంది.