ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు గడ్డు కాలం రానుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే వాట్సాప్ ఇటీవలే తన టర్మ్స్ అండ్ కండిషన్స్, పాలసీలకు మార్పులు, చేర్పులు చేసింది. అందులో భాగంగానే ఇప్పటికే అనేక మంది యూజర్లకు కొత్త పాలసీలకు చెందిన ఒక పేజీని వాట్సాప్ ముందుగా చూపిస్తోంది. దానికి ఓకే చెబితేనే ముందుకు కొనసాగగలుగుతారు. వాట్సాప్‌ను ఉపయోగించుకోగలుగుతారు. వాట్సాప్ రూపొందించిన కొత్త పాలసీలు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి అమలు కానున్నాయి.
అయితే వాట్సాప్ ఇప్పటి వరకు మనకు తెలియకుండానే డేటాను తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు షేర్ చేస్తూ వచ్చింది. కానీ ఇకపై మన అనుమతితో అధికారికంగానే మన వాట్సాప్ డేటాను ఫేస్‌బుక్‌తో షేర్ చేస్తుందన్నమాట. ఆ మేరకు కొత్త పాలసీల్లో మార్పులు చేశారు. అయితే ఈ విషయం ఎంతో మంది వాట్సాప్ యూజర్లకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో వారు వాట్సాప్‌ను పెద్ద ఎత్తున అన్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు. అలాగే వాట్సాప్ నుంచి చాలా మంది మరో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రాం వైపు మళ్లుతున్నారు.
నిజానికి వాట్సాప్ కన్నా టెలిగ్రాంలో ఎన్నో మెరుగైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. టెలిగ్రాంలో ఒక గ్రూపుకు దాదాపుగా 5వేల మంది వరకు ఉండవచ్చు. కానీ వాట్సాప్‌లో అందుకు 250 వరకు మాత్రమే అనుమతి ఉంది. ఇక వాట్సాప్‌లో కేవలం 25 ఎంబీ సైజ్ ఉన్న ఫైల్ ను మాత్రమే గరిష్టంగా పంపుకోగలరు. కానీ టెలిగ్రామ్‌లో ఏకంగా 1.50 జీబీ సైజ్ ఉన్న ఫైల్‌ను కూడా పంపుకోవచ్చు. అలాగే టెలిగ్రాంలో సీక్రెట్ చాట్ అనే మరో ఫీచర్ ఉంది. దీని సహాయంతో ఎవరైనా సరే సీక్రెట్‌గా చాట్ చేయవచ్చు. ఆ చాట్ తాలూకు సమాచారం టెలిగ్రాం సర్వర్లలో స్టోర్ కాదు. అలాగే టెలిగ్రాంను ఎన్ని డివైస్‌లలో అయినా ఒకేసారి ఉపయోగించుకోవచ్చు. కానీ వాట్సాప్‌లో కేవలం ఒక డివైస్‌లో మాత్రమే ఒక వాట్సాప్ అకౌంట్‌ను వాడుకోగలరు. ఇక టెలిగ్రామ్‌లో కాంటాక్ట్ నంబర్ లేకున్నా సరే ఎవరితో అయినా చాటింగ్ చేయవచ్చు. అందువల్ల ఇన్ని ఫీచర్లు ఉన్నాయి కనుకనే చాలా మంది వాట్సాప్‌ను వదిలి టెలిగ్రామ్‌ను ఇప్పుడు తమ తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు.