ఈ ఫోన్లలో ‘వాట్సప్‌’ ఇక పనిచేయదు

కొన్ని పాత స్మార్ట్‌ఫోన్లకు ప్రముఖ మెసెంజర్‌ ‘వాట్సప్‌’ తన సపోర్ట్‌ను నిలిపివేయనుంది. 2020 జనవరి 1నుండి పాత ఆపరేటింగ్‌ సిస్టం ఉన్న ఫోన్లలో వాట్సప్‌ పనిచేయదు. ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌ వర్షన్లు అప్‌డేట్‌ అయినప్పుడల్లా వాట్సప్‌ కూడా అప్‌డేట్‌ అవుతూనే ఉంది. కొత్తకొత్త సౌలభ్యాలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అయితే కొత్త ఫీచర్లను జోడించేప్పుడు డెవెలపర్లు పాత వర్షన్లను విస్మరిస్తుంటారు లేదా ఉద్దేశపూర్వకంగా వదిలేస్తారు. ఎందుకంటే, వారికున్న సమాచారం ప్రకారం ఆ పాత వర్షన్లతో ఉన్న ఫోన్లు ప్రపంచంలో చాలాచాలా తక్కువ.

మైక్రోసాఫ్ట్‌ ఇటీవలే తన మొబైల్‌ ఆపరేటింగ్‌ వ్యవస్థ ‘విండోస్‌ మొబైల్‌’ను అధికారికంగా నిలిపివేసింది. దానికి ఇకనుంచి మైక్రోసాఫ్ట్‌ నుంచి సహకారం కూడా ఉండదు. ఈ ఓఎస్‌తో నడుస్తున్న ఫోన్లు ప్రపంచంలో దాదాపుగా లేవు. ఉన్నా, అతితక్కువ. ఈ మార్పును పురస్కరించుకుని వాట్సప్‌ కూడా జనవరి 1 నుండి విండోస్ మొబైల్‌కు తన సహకారాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇదే ఉద్దేశాన్ని, వాట్సప్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లకు కూడా వర్తింపజేయనుంది. ఆండ్రాయిడ్‌ 2.3.7, అంతకంటే పాత ఓఎస్‌ ఉన్న ఉపకరణాలకు, ఐఓఎస్‌ 8, అంతకంటే పాత ఫోన్లకు కూడా వాట్సప్‌ సహకారాన్ని ఫిబ్రవరి 1, 2020 నుండి నిలిపివేయనున్నట్లు తెలిపింది. పైన తెలిపిన ఓఎస్‌లతో నడుస్తున్న పరికరాలు చాలా తక్కువ కాబట్టి, ప్రపంచ వినియోగదారులలో దాదాపు ఎవరికీ వాట్సప్‌ సేవలలో ఆటంకం కలిగే అవకాశం లేదు. ఉన్నవాళ్లు మాత్రం సాధ్యమైనంత త్వరగా కొత్త ఫోనుకు మారిపోవడం బెటర్‌. వాట్సప్‌ అనేకాక, భద్రతాకారణాల రీత్యా కూడా పాత ఆపరేటింగ్‌ వ్యవస్థ ఉండటం మంచిది కాదు.