మన ఆలోచనలు చదివేసే ఈ హెడ్‌బ్యాండ్‌ గురించి మీకు తెలుసా..?

-

ఇంట్లో సోఫాలో కూర్చొని హాయిగా టీవీ చూస్తున్నాం. కానీ రిమోట్ ఎక్కడో మర్చిపోయాం. ఇప్పుడు లేచి రిమోట్ తీసుకోవాలంటే బద్ధకం. హాయిగా పడుకుందామని రాత్రి బెడ్ ఎక్కాం.. కానీ లైట్ ఆఫ్ చేయడం మరిచిపోయాం. లేచి లైట్ ఆఫ్ చేయాలంటే బద్ధకం. గాఢ నిద్రలో ఉన్నాం.. బాగా చలేస్తుంది. ఫ్యాన్ ఆఫ్ చేయాలంటే నిద్రలేవాలి. ఒక్కసారి లేచామంటే మళ్లీ నిద్రపట్టడం గగనం. ఇలాంటి పరిస్థితుల్లో జస్ట్ ఓ క్లిక్‌తోనే లైట్, ఫ్యాన్, టీవీ ఆఫ్‌ అయిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. మీ బాధను షావోమీ అర్థం చేసుకుంది. మీ కోసం ఓ సూపర్ గ్యాడ్జెట్‌ని అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనిలో ఇంకా వావ్ అనిపించే ఎన్నో సూపర్ ఫీచర్లున్నాయి. అవేంటో లుక్కేయండి..

ఎంఐజీయూ హెడ్‌బ్యాండ్‌ (Xiaomi MiGU Headband) పేరుతో షావోమి తీసుకొస్తున్న గ్యాడ్జెట్‌తో ఇంట్లోని స్మార్ట్‌ ఉత్పత్తులను నియంత్రించవచ్చట. ఫ్యాన్‌, లైట్‌, టీవీ వంటి వాటితోపాటు ఇతర ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్) ఆధారిత ఉత్పత్తులను నియంత్రిస్తుందట. అందులో కొత్తేముంది.. స్మార్ట్‌ఫోన్‌ నుంచి కూడా ఈ పనిచేయవచ్చు కదా అనుకోవచ్చు. కానీ, ఈ బ్యాండ్‌ మనిషి మెదడులోని ఆలోచనల ఆధారంగా పనిచేస్తుందట. ఇంట్లోని స్మార్ట్‌ ఉత్పత్తులను నియంత్రించడంతోపాటు, కారు డ్రైవింగ్‌లోనూ సాయపడుతుందని బ్యాండ్‌ డెవలపర్స్ చెబుతున్నారు.

‘‘షావోమి ఎంఐజీయూ హెడ్‌బ్యాండ్‌లో మూడు పాయింట్లు ఉంటాయి. ఎలక్ట్రికల్‌ సిగ్నల్స్‌ పొందేందుకు, యూజర్‌ ఈఈజీ (ఎలక్టోఎన్సెఫాలోగ్రఫీ) వేవ్‌ఫామ్స్‌ చదివేందుకు ఆ పాయింట్లు సాయపడతాయి. యూజర్ల మూడ్‌ ఆధారంగా వ్యక్తపరిచే ఎమోషన్స్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే వేవ్‌ఫామ్స్‌ను హెడ్‌బ్యాండ్‌లోని ఆర్టిఫిషియల్‌ లేబుల్డ్‌ మెషీన్‌ గ్రహిస్తుంది. వాటి ఆధారంగా మనిషి చేయాలనుకుంటున్న పనిని హెడ్‌బ్యాండ్‌కు అనుసంధానమైన స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ ద్వారా పూర్తి చేస్తుంది’’ అని షావోమి తెలిపింది.

ప్రస్తుతం ఈ బ్యాండ్ పరీక్షల దశలో ఉంది. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ గ్యాడ్జెట్‌తో యూజర్ల స్మార్ట్‌లైఫ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుందని షావోమి చెబుతోంది. దీని పనితీరు గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news