ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన యూట్యూబ్ సైట్‌లో ఓ నూతన ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. అందులో ఇకపై యూపీఐ ద్వారా పేమెంట్లు చేయవచ్చు. ఇప్పటి వరకు యూట్యూబ్ లేదా యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లలో ప్రీమియం సేవలు పొందాలన్నా లేదా.. చానల్ క్రియేటర్లకు సూపర్ చాట్ ద్వారా డబ్బులు పంపాలన్నా.. మెంబర్‌షిప్ పొందాలన్నా.. లేదా మూవీస్‌ను కొనుగోలు చేయాలన్నా.. కేవలం క్రెడిట్ లేదా డెబిట్ కార్డులకు మాత్రమే అనుమతి ఉండేది. కానీ ఇకపై యూజర్లు యూపీఐ పేమెంట్ విధానంలోనూ ఆ సేవలను ఉపయోగించుకోవచ్చు.
ఇక యూట్యూబ్ లో యూపీఐ ద్వారా పేమెంట్ చేసే వారు ఏ యూపీఐ యాప్ నుంచైనా చెల్లింపులు చేయవచ్చు. భీమ్ యూపీఐ, గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే, అమెజాన్ యూపీఐ ద్వారా యూట్యూబ్‌లో చెల్లింపులు చేయవచ్చు. ఈ క్రమంలో వినియోగదారులు యూపీఐ ద్వారా యూట్యూబ్‌లో యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అలాగే తమ ఫేవరెట్ మూవీలను కొనుగోలు చేయవచ్చు. సూపర్ చాట్ ద్వారా డబ్బులు విరాళం పంపవచ్చు.
కాగా గూగుల్‌కు చెందిన గూగుల్ ప్లేకు గత డిసెంబర్ నెలలో యూపీఐ సపోర్ట్‌ను అందివ్వగా.. ఇప్పుడు యూట్యూబ్‌కు ఆ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు.