ఏపీలో అమ్మఒడి పథకం ద్వారా జగన్ సర్కారు ఏడాదికి 15వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకం విధివిధానాలను ఏపీ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న అమ్మఒడి పథకానికి 6450 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదాన్ని తెలియ చేసింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సమావేశమైన మంత్రివర్గం ఒకటవ తరగతి నుంచి 12 తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు, సంరక్షకులకు ఈ పధకం వర్తింపచేసేలా మంత్రి మండలి తీర్మానం చేసింది. అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు అర్జీ ఉంటే లబ్దిదారులుగా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది.
జనవరి లో బ్యాంకు ఖాతాలకు ఈ నిధుల జమ అయ్యేలా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంటే అమ్మఒడి పథకం మీ పిల్లలకు వర్తించాలంటే.. వారు ఒకటి నుంచి 12 తరగతులు చదువుతున్నవారై ఉండాలి. మీకు తెల్లరేషన్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు లేకపోయినా మీరు దాని కోసం దరఖాస్తు పెట్టుకుని ఉండాలి. అంటే ప్రైవేటు స్కూళ్లలో చదివినా తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలన్నమాట.