ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి? ఈ తప్పులు చేయకూడదు!

-

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. హైదరాబాద్‌– మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గానికి 71 మంది, వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల స్థానానికి 93 మంది పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల పేర్లతో పాటు, నోటా కూడా కలిపి ఈ ఎన్నికల్లో జంబో బ్యాలెట్‌ను వినియోగిస్తున్నారు. సాధారణ ఎన్నికలతో పోల్చితే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఇది భిన్నంగా ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మందికైనా ఓటు వేసే అవకాశం ఉంటుంది. పట్టభద్రుల ఎన్నికలే అయినప్పటికీ ఓటింగ్‌ విషయంలో చాలా మంది సందిగ్ధం చెందుతారు. అందుకే ఓటు వేసే ముందు ఈ విషయాలు ముందుగా తెలుసుకోండి. ఆ తర్వాత ఓటు వేయటానికి వెళ్లాలి. లేకపోతే కొన్ని పొరబాట్లకు ఆస్కారం ఉంది.

 

మొదట పోలింగ్‌ కేంద్రం లోపలికి వెళ్లిన వెంటనే ఓటరు జాబితాలో మీ పేరును అధికారులు తనిఖీ చేస్తారు. ఏదైనా ఐడీ కార్డును చూసి, ఓటును నిర్ధారించుకున్న తర్వాత లిస్టులో టిక్‌ చేస్తారు. ఆ తర్వాత మీ చేతికి బ్యాలెట్‌ పేపర్‌తో పాటు పెన్ను ఇస్తారు.

  • ఆ పేపర్‌పై అభ్యర్థులందరి పేర్లు తెలుగు, ఆంగ్ల భాషల్లో రాసి ఉంటాయి. అభ్యర్థి పేరుకు ఎదురుగా గళ్లు ఉంటాయి. అందులో మీకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యత సంఖ్యను వేయాల్సి ఉంటుంది.
  • మీ ప్రాధాన్యతను కేవలం అంకెల్లో (1, 2, 3, 4) మాత్రమే రాయాల్సి ఉంటుంది. టిక్‌ మార్క్, వేలి ముద్రలు, రోమన్‌ అంకెలు వేయకూడదు. అలా చేస్తే ఆ ఓటు చెల్లదు.
  • పోలింగ్‌ కేంద్రంలో అధికారి ఇచ్చే ఉదా రంగు కలర్‌ స్కెచ్‌ పెన్ తో మాత్రమే సంఖ్యను వేయాలి. అభ్యర్థుల సంఖ్య ఉన్నంత వరకు ప్రాధాన్యత సంఖ్యను వేస్తూ వెళ్లవచ్చు.
  • ఓటు ప్రాధాన్యతను సూచించే క్రమంలో మధ్యలో ఒక్క అంకెను కూడా మినహాయించకూడదు. ఉదాహరణకు 1, 2, 3, 4 , 6, 7 ఇలా ప్రాధాన్యత ఇస్తే .. మధ్యలో ‘5 ’ మిస్‌ అయినందున 4 వరకే పరిగణనలోకి తీసుకుంటారు.
  • ఒక్క అభ్యర్థికి ఒక్క ఓటును మాత్రమే ఇవ్వాలి. ఒకరి కంటే ఎక్కువ మందికి ’1’ అని ఇస్తే ఆ ఓటును పరిగణలోకి తీసుకోరు. ఒక అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యత అంకెలు ఇచ్చినా అది చెల్లదు.
    బ్యాలెట్‌ పేపర్లో ఉన్న అభ్యర్థుల్లో ఎంత మందికైనా ఓటు వేయవచ్చు. కేవలం ఒక్కరికి కూడా మీరు ఓటు వేయవచ్చు. అలాగే ఇద్దరు, ముగ్గురికి కూడా మద్దతు తెలపవచ్చు.
  • ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో 71 మంది పోటీల్లో ఉంటే.. 71 మందికి ఓటు వేయవచ్చు. ఐతే 1 నుంచి 71 వరకు అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడీల్లో నంబర్లను రాయాల్సి ఉంటుంది. ఏ ఎన్నికల్లోనైనా ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని గెలిచినట్టు ప్రకటిస్తారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ భిన్నం. మొత్తం చెల్లుబాటైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తేనే విజేతగా ప్రకటిస్తారు. ఒక అభ్యర్థికి 50 +1 వచ్చే వరకు. 1,2,3 ప్రాధాన్య ఓట్ల కౌంటింగ్‌ జరుగుతూనే ఉంటుంది. ఉమ్మడి ఏపీతో పాటు, తెలంగాణలో ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1వ ప్రాధాన్యత ఓటు లెక్కింపుతో ఎవరూ గెలవలేదు. 2వ ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలింది. అందుకే మీ ఓటును వృథా కానివ్వకండి. ముందుగానే రూల్స్‌ను తెలుసుకొని వెళ్లాండి. మీ అమూల్యమైన పట్టభద్ర ఓటును వినియోగించుకోండి. అదేవిధంగా సరైన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన పై ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news