వ్యాక్సిన్‌ పేరుతో డమ్మీ యాప్‌లు జాగ్రత్త..

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి రంగం సిద్ధమవుతున్న తరుణంలో, కొందరు ఇంటర్నేట్‌లో ‘కొవిన్‌ యాప్‌’ కోసం సెర్చ్‌ చేస్తూ నకిలీ యాప్‌ల బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ యాప్‌ను అధికారికంగా అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే.. అదేమాదిరిగా ఉంటే నకిలీ యాప్‌లలో కొందరు తమ సమాచారాన్ని పొందుబరుస్తున్నారు. దీంతో విలువైన సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి కొవిన్‌ యాప్‌ అందుబాటులోకి రాలేదని అందుకోసం దాదాపుగా 4 వారాల సమయం పడుతుందని అప్పటి వరకు ఎలాంటి యాప్‌లలో తమ వివరాలు నమోదు చేయరాదని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి.

రేపు కేంద్ర మంత్రితో చర్చ..

ఇదే విషయమై ఇటీవల రాష్ట్ర ఆరోగ్య శాఖ యంత్రాంగం సమీక్షించారు. లబ్ధిదారులకు టీకా అందించే విషయంలో స్పష్టత లేకపోవడంతో రేపు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో చర్చించనున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీలో ముఖ్యమై కొవిన్‌ యాప్‌లో వివరాలు పొందుబరిస్తే ఆ వ్యాక్సిన్‌ పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. ఇప్పటి దాకా అంది కేవలం పోలీస్, రెవెన్యూ పురపాలక వైద్య సిబ్బందికే అందుబాటులో ఉంది. తెలంగాణలో మొదటి విడతగా 75 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించగా అందులో ఈ కేటగిరిలకు చెందిన వారు కేవలం 5 లక్షలు మాత్రమే.

అధికారికంగా ప్రకటిస్తుంది..

ఇంటర్నేట్‌లలో పుట్టుకొస్తున్న నకిలీ యాప్‌లలో ఎవరూ తమ వివరాలు నమోదు చేయొద్దు. దీంతో మీ విలువైన సమాచారమంత బయటకు వెళ్లే ఆస్కారం ఉంటుందని ఆరోగ్య సంచాలకులు జీ. శ్రీనివాస్‌ హెచ్చరించారు. కొవిన్‌ యాప్‌ను అందుబాటులోకి వస్తే ప్రభుత్వమే అధికారికంగా ప్రకటిస్తుందని మరో మూడు, లేదా నాలుగు వారాల్లో కొవిన్‌యాప్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అంత వరకు ఎలాంటి యాప్‌లలో వివరాలు నమోదు చేయరాదన్నారు.