స్మార్ట్‌ఫోన్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా..? అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి.

-

ఎంతో డ‌బ్బు పెట్టి కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్ కింద ప‌గిలితే, లేదంటే చోరీకి గురైతే, లేదా నీళ్ల‌లో ప‌డి చెడిపోతే.. అప్పుడు ఎలాంటి బాధ క‌లుగుతుందో అంద‌రికీ తెలుసు. అందుకే ఇప్పుడు చాలా కంపెనీలు స్మార్ట్‌ఫోన్ల‌కు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా క‌ల్పిస్తున్నాయి. యాక్సిడెంట‌ల్‌, థెఫ్ట్‌, లిక్విడ్ డ్యామేజ్‌, డ్రాప్ ప్రొటెక్ష‌న్‌.. ఇలా అనేక స‌దుపాయాలతో కూడిన ఇన్సూరెన్స్‌ను కంపెనీలు మొబైల్ ఫోన్ల‌కు అందిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మొబైల్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు కింద ఇచ్చిన ప‌లు అంశాల గురించి త‌ప్ప‌క అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి. అవేమిటంటే…

1. అగ్ని ప్రమాదాలు, అల్లర్లు, ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు, ఫోన్ దొంగతనానికి గురైనప్పుడు, నీళ్లలో పడి మొబైల్‌ పాడైనప్పుడు మరికొన్ని సందర్భాల్లో మాత్రమే మొబైల్ ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

2. అనుమానాస్పద స్థితిలో, దేశం బ‌య‌ట‌ మొబైల్‌ పోగొట్టుకున్నప్పుడు, మరో వ్యక్తి ఉపయోగిస్తున్నప్పుడు ఫోన్‌ పాడైనా లేదా పోయినా, అధీకృత సంస్థల వద్ద కాకుండా వేరే ఎక్కడైనా రిపేర్ చేయించినప్పుడు, అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్ల, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన సమయంలో జరిగే నష్టానికి మొబైల్ ఇన్సూరెన్స్ ఇవ్వ‌రు.

3. మొబైల్‌ కొన్న ఒకటి, రెండు రోజుల్లోపే ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. బీమా తీసుకునేందుకు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రాథమిక సమాచారాన్ని పూరించాల్సి ఉంటుంది. తర్వాత బీమా కంపెనీలు మొబైల్‌ కొనుగోలు బిల్లు, వ్యక్తిగత గుర్తింపు పత్రం లాంటి వివరాలను పోస్ట్‌లో పంపాల్సిందిగా కోరతాయి. కొన్ని కంపెనీలు వాట్సప్‌లో డాక్యుమెంట్ల ఫోటోలు తీసి పంపేందుకు అవకాశమిస్తున్నాయి. లేదంటే ఆయా కంపెనీల‌కు చెందిన ఆఫీస్‌ల‌కు వెళ్లి కూడా సంబంధిత ప‌త్రాల‌ను చూపించి మొబైల్ ఇన్సూరెన్స్ తీసుకోవ‌చ్చు.

4. ఇన్సూరెన్స్‌ క్లెయిం ఫాం, మొబైల్‌ కొనుగోలు బిల్లు, క్లెయిం వివరాలను తెలియపరిచేందుకు అక్‌నాలెడ్జ్‌మెంట్, మొబైల్‌ దొంగతనానికి సంబంధించి స్థానిక పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు కాపీ, లెటర్‌ ఆఫ్‌ ఇండెమ్నిటీ, బీమా కంపెనీ అడిగిన విధంగా మొబైల్‌ గుర్తించబడలేదని నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే మొబైల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది.

5. క్లెయిం ఫాం, మొబైల్‌ కొనుగోలు బిల్లు, క్లెయిం వివరాలను తెలియపరిచేందుకు అక్‌నాలెడ్జ్‌మెంట్‌, ప్రమాదానికి గురైన ఫోన్‌ స్క్రీన్‌ ఫోటోతో పాటు ఐఎమ్‌ఈఐ నంబరుతో కూడిన ఫోటో, అధీకృత సేవా కేంద్రం అందించే మరమ్మతు ఖర్చుల అంచనా పత్రం / రీప్లేస్‌మెంట్‌ బిల్లు లేదా నష్టపోయినట్లు ఇచ్చే సర్టిఫికెట్‌తో పాటు బిల్లు, మరమ్మతు/ రీప్లేస్‌మెంట్‌కు సంబంధించిన బిల్లు, క్లెయిం సొమ్ముకు సంబంధించిన సర్వే నివేదికలు కూడా కొన్ని సంద‌ర్భాల్లో అవసరమవుతాయి.

6. మొబైల్‌ ఫోన్‌ పోయినట్లుగా గుర్తించిన వెంటనే 24 గంటల్లోగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్నప్పుడు 48 గంటల్లోగా బీమా కంపెనీకి సమాచారం అందించాలి. క్లెయిం పొందేందుకు బీమా కంపెనీ సూచించిన విధంగా సూచ‌న‌లు పాటించాలి.

స్మార్ట్‌ఫోన్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ. 5000 కన్నా తక్కువ ఖరీదు కలిగిన మొబైల్‌ ఫోన్లకు రూ. 299 నుంచి రూ. 600 వర‌కు ఉంటుంది. అలాగే రూ. 5000 నుంచి రూ. 15000 లోపు వాటికి రూ. 500 నుంచి రూ. 1300 వరకూ ప్రీమియం ఉంటుంది. రూ. 15000 నుంచి రూ. 25000 లోపు వాటికి రూ. 1200 నుంచి రూ. 2000 వరకూ ప్రీమియం ఉంటుంది. ఇంకా ఖరీదైన ఫోన్లకు పాలసీ వర్తింపును బట్టి రూ. 2000 నుంచి రూ. 5000 వరకూ ప్రీమియం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version