ఇకపై దుబాయ్ వెళ్లే భారతీయులు మన కరెన్సీతోనే అక్కడ షాపింగ్ చేయవచ్చు. దుబాయ్‌లో ఇప్పుడు ఇండియన్ కరెన్సీని అనుమతిస్తున్నారు. దీంతో మన రూపాయాలతోనే అక్కడ ఏదైనా కొనవచ్చు.
ఒక దేశానికి చెందిన పౌరులు మరో దేశానికి వెళితే.. తమ కరెన్సీని ఆ దేశ కరెన్సీలోకి మార్చుకుని అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఆయా కరెన్సీలకు గాను మారకం విలువ మారుతూ ఉంటుంది. అంటే మనకు ఒక అమెరికా డాలర్ కావాలంటే దాదాపుగా 69 రూపాయల వరకు చెల్లించాలి. అదే పౌండ్ అయితే మరోరకంగా, దీనార్ అయితే ఇంకో రకంగా ఉంటుంది. ఈ క్రమంలో మన దగ్గర ఉన్న కరెన్సీని ఇతర దేశాలకు చెందిన కరెన్సీలోకి మారిస్తే పెద్ద మొత్తంలో ఎక్స్‌ఛేంజ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఇతర దేశాల మాటేమోగానీ ఇకపై దుబాయ్ వెళ్లే భారతీయులు మాత్రం మన కరెన్సీతోనే అక్కడ షాపింగ్ చేయవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. దుబాయ్‌లో ఇప్పుడు ఇండియన్ కరెన్సీని అనుమతిస్తున్నారు. దీంతో మన రూపాయాలతోనే అక్కడ ఏదైనా కొనవచ్చు. ప్రయాణికులు పెద్ద ఎత్తున కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ ఫీజు చెల్లించాల్సి వస్తుందని గమనించిన దుబాయ్ ప్రభుత్వం భారతీయులకు ఈ సదుపాయాన్ని కల్పించింది. దీంతో దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఏ1 మక్టోమ్ ఎయిర్‌పోర్టులలో ఉన్న మూడు టెర్మినల్స్‌లో భారతీయులు మన కరెన్సీతోనే షాపింగ్ చేయవచ్చు.
కాగా 2018 సంవత్సరంలో దుబాయ్ ఎయిర్‌పోర్టుల ద్వారా ప్రయాణించిన మొత్తం ప్రయాణికుల సంఖ్య 90 మిలియన్లు ఉండగా వారిలో 12.2 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారని దుబాయ్ డ్యూటీ ఫ్రీ స్టాఫ్ తెలిపారు. అందుకనే భారత ప్రయాణికుల కోసం భారత కరెన్సీని దుబాయ్ ఎయిర్‌పోర్టులలో అనుమతిస్తున్నామని వారు వెల్లడించారు. కాగా గతంలో భారత ప్రయాణికులు దుబాయ్‌లో షాపింగ్ చేయాలంటే తమ వద్ద ఉన్న రూపాయలను డాలర్, దీర్హామ్ లేదా యూరోలలోకి మార్చుకుని అక్కడ డబ్బులను ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త రూల్ వల్ల ఇకపై భారతీయులు రూపాయలను ఇతర కరెన్సీలోకి మార్చుకోవాల్సిన అవసరం లేదు. దీంతో వారికి కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ రుసుం ఆదా కానుంది. కాగా 1983 డిసెంబర్‌లో దుబాయ్‌లో ఇతర దేశాల కరెన్సీకి అనుమతినివ్వడం మొదలయ్యాక ఇప్పటి వరకు అక్కడ 15 దేశాలకు చెందిన కరెన్సీలను వాడుతున్నారు. ఈ క్రమంలో దుబాయ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అక్కడ అనుమతి పొందిన 16వ దేశ కరెన్సీగా భారత రూపాయి పేరుగాంచింది..!