బ్యాంకు వేలంలో ప్రాపర్టీని కొనుగోలు చేయడం లాభమేనా..?

-

సొంత ఇళ్లును కట్టుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ దానికి సరిపడా డబ్బు ఎవరి దగ్గరా ఒకేసారి ఉండదు. చాలామంది హోమ్‌ లోన్‌ తీసుకుని ఇల్లు కడతారు. ఏళ్ల తరబడి ఆ ఈఎంఐలు కడుతుంటారు. అయితే నెల నెల EMIలు కడితే ఎలాంటి బాధ ఉండదు. కానీ పరిస్థితుల బాగోకనో, మరే కారణం చేతనో మీరు ఈఎంఐలు చెల్లించకలేకపోతే రుణం డీఫాల్ట్‌ అవుతుంది. ప్రారంభంలో బ్యాంకులు రికవరీ నోటీసులు పంపుతాయి. అప్పటికీ కట్టకపోతే చివరికి బ్యాంకులు ఆ ప్రాపర్టీని వేలం వేస్తాయి. ఈ ఆస్తుల్లో నివాస, వాణిజ్య ఆస్తులు ఉంటాయి. ఇలాంటి వేలంలో పాల్గొనడానికి ఎక్కువ మందే ఆసక్తి చూపుతారు. ఈరోజు మనం అలాంటి వేలం ద్వారా వచ్చే ప్రాపర్టీని కొనుగోలు చేయడం లాభమా, నష్టమా..? ఎలాంటి రిస్క్‌లు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.. ఇలాంటివేవి తెలియకుండా బ్యాంకులు ప్రాపర్టీని వేలం వేస్తున్నాయి కదా అని ఎగబడి కొంటే చాలా సమస్యలను భవిష్యత్తులో ఎదుర్కొనాల్సి వస్తుంది.

auction

ఈ ఆస్తులను వేలానికి ఉంచినప్పుడు, దేశంలోని ఏ ప్రాంతంలో భారతీయ పౌరుడైనా వేలంలో పాల్గొని ప్రాపర్టీని కొనుగోలు చేయొచ్చు. బ్యాంకులు వేలంలో వేసే ప్రాపర్టీ విలువ మార్కెట్‌ రేటు కంటే 10-20% తక్కువే ఉంటాయని రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణులు చెప్తున్నారు. చాలా ప్రాపర్టీలు మౌలిక సౌకర్యాలున్న చోట లభిస్తాయి. నిర్మాణం పూర్తయిన ఆస్తిని వేలంలో పొందడం వల్ల ఎంతో సమయం ఆదా అవ్వడమే కాకుండా పని భారం చాలా వరకు ఉండదు. ప్రాపర్టీని రెడీమేడ్‌గా పొందొచ్చు. బ్యాంకులు ప్రాపర్టీ వేలానికి ముందు చట్టపరమైన ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాయి. ఇవన్నీ వేలంలో పాల్గొనే కొనుగోలుదారుడుకి లాభించేవే.

ఇబ్బందులు ఏం ఉంటాయి..

వేలంలో ప్రాపర్టీని కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు మొత్తం ఆస్తి విలువలో 10% నుంచి 15% వరకు ప్రీ-బిడ్డింగ్‌ డిపాజిట్‌గా సరిపోయే మొత్తాన్ని బ్యాంకు వద్ద డిపాజిట్‌ చేయాలి. బిడ్‌ గెలిచి, మిగిలిన మొత్తాన్ని కచ్చితంగా నిర్దేశించిన గడువులోగా చెల్లించాలి. ఉదాహరణకు SBI బ్యాంకు నిర్వహిస్తున్న వేలంలో పాల్గొంటే విక్రయ ధరలో 25 శాతాన్ని బిడ్డింగ్‌ తర్వాత పని దినం నాటికి డిపాజిట్‌ చేయాలి. మిగిలిన 75% మొత్తాన్ని వేలం గెలిచిన 15 రోజుల్లోగా చెల్లించాలి. చెల్లించడంలో విఫలమైతే వేలంలో పాల్గొన్నవారు ప్రీ-బిడ్డింగ్‌ మొత్తాన్ని కోల్పోతారు. కాబట్టి బిడ్‌ మొత్తాన్ని సాధ్యమైనంత త్వరగా సిద్ధంగా పెట్టుకోవడం, గడువులోగా చెల్లించడం మంచిది.

ఆస్తికి సంబంధించి బ్యాంకుకు కూడా తెలియని వివాదాలు ఉండొచ్చు. బిడ్డింగ్‌ తర్వాత మీరు ఇబ్బందుల్లో పడినట్లయితే బ్యాంకు దానికి బాధ్యత వహించదని గుర్తించండి. డిఫాల్ట్‌దారుడు బ్యాంకు ఈఎంఐలే కాకుండా మరిన్ని బకాయిలను కూడా కలిగి ఉండొచ్చు. ఉదాహరణకు గడిచిన కాలానికి సంబంధించిన ఆస్తి పన్నులు, యుటిలిటీ బిల్లులు, కమ్యూనిటీ సోసైటీ ఛార్జీల్లో ఎంత బకాయిలు ఉన్నాయో వేలంలో పాల్గొనే ముందే బిడ్డింగ్‌దారుడు తెలుసుకోని ఉండాలి

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఆస్తికి సంబంధించిన చట్టపరమైన స్థితిని తనిఖీ చేయడమే కాకుండా, దాని మార్కెట్‌ విలువను అంచనా వేయాలి. ఆస్తిపై ఎటువంటి వివాదాలూ లేవని నిర్ధారించుకోవడానికి ఆస్తి యజమాన్యం, టైటిల్‌ పత్రాలను తనిఖీ చేసుకోవాలి. అంతే కాకుండా ఆస్తి నివాసయోగ్యంగా లేదా ఉపయోగించుకోవడానికి సౌకర్యంగా ఉందో లేదో స్వయంగా వెళ్లి చూడాల్సి ఉంటుంది. అధిక మరమ్మతులతో నిర్మాణాత్మక సమస్యలున్న ఆస్తిని వేలంలో కొనుగోలు చేయకపోవడమే ఉత్తమం.

ప్లాట్లు, ఇల్లు లేదా అపార్ట్‌మెంట్‌ వంటి స్థిరాస్తిని వేలం వేసేటప్పుడు బ్యాంకులు కేవలం చట్టపరమైన పత్రాలను మాత్రమే కలిగి ఉండి ఆస్తిని సాంకేతికంగా స్వాధీనం చేసుకుంటాయి. ప్రాపర్టీలో ఉన్న ఆక్రమణదారులను బ్యాంకు తొలగించదు. అటువంటి సందర్భాల్లో అద్దెదారులను ఖాళీ చేయించి ప్రాపర్టీని స్వాధీనం చేసుకునే బాధ్యత కొత్తగా కొనుగోలు చేసిన వారిపైనే పడుతుంది. వేలంలో పాల్గొనేవారు కేవలం బ్యాంకు పత్రాలను మాత్రమే చూసి నిర్ణయాలు తీసుకోవద్దు. అందుచేత, ప్రాపర్టీలో పాత యజమాని లేదా ఇతర అద్దెదారులు ఎవరైనా ఉంటే వారిని ఖాళీ చేయించాలి. ఈ పని బిడ్డింగ్‌లో పాల్గొనే ముందే చేయాల్సి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు, చికాకులు లేకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news