90 ఏళ్ల క్రితం మహాత్మా గాంధీ రాసిన చేతిరాత పత్రాలు ల‌భ్యం!

697

భారతదేశం అంటే గాంధీ అనే నానుడి ప్రపంచవ్యాప్తంగా ఉంది. అటువంటి ఆయన్ను మనం జాతిపితగా, మహాత్ముడిగా కీర్తిస్తున్నాం. ఆయన చేసిన ప్రతిపని మనకు ఆదర్శం, ఆచరణీయం. అటువంటి మహాత్ముడి గురించి మనకు లభించే ప్రతి ఒక్కటి అమూల్యం. ఆయన రాత ఎలా ఉంటుందో చూడాలని చాలామందికి కోరిక. దానిగురించి ఇటీవల లభ్యమైన విషయాలను తెలుసుకుందాం…

భారత జాతిపిత మహాత్మాగాంధీ 90 ఏళ్ల క్రితం రాసిన పత్రాలు ఇప్పుడు లభ్యమై దేశ చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచాయి. మహాత్మాగాంధీ 1929లో నవజీవన్ పత్రికకు రాసిన సంపాదకీయం తాలూకు పత్రాలు ప్రతాప్‌గఢ్ కలెక్టరేట్‌లోని దస్ర్తాల గదిలో లభ్యమయ్యాయి. వీటిని ప్రాంతీయ ప్రాచీన ప్రతుల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాచీన ప్రతుల శాఖ అధికారి అగ్నిహోత్రి ప్రతుల్లో ఉన్న విషయాలను కొన్ని విషయాల్ని తెలియజేశారు.

Mahatma Gandhi’s 90-year-old rare hand-written editorial found in Pratapgarh
Mahatma Gandhi’s 90-year-old rare hand-written editorial found in Pratapgarh

దేశ స్వాతంత్య్రోద్యమం ఉత్తరభారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో భూస్వాములపై ఏవిధంగా ప్రభావితం చేసింది అనే విషయాలు ఆయన ఈ సంపాదకీయంలో వివరించారు.జమీన్‌దార్ ఔర్ తాలూక్‌దార్ అనే పేరున ఆయన ఈ సంపాదకీయాన్ని రాశారు. అట్టడుగు ప్రజల్లో దేశభక్తి పెంపొందిన విధానాన్ని ఇందులో ప్రస్తావించారు. దేశం కోసం భూస్వాములు తీసుకున్న నిర్ణయాలను రాశారు. స్వాతంత్య్రోద్యమ భావాలు భూస్వాముల్లో బలపడడంతో తమ సంస్థానాల్లో ప్రజలకు పన్నుల నుంచి విముక్తి కలిగించారు అని ఇందులో గాంధీ రాశారు.

editorial penned by Mahatma Gandhi for ‘Navajivan Patrika’ 1929

అదేవిధంగా గాంధీజీ ఇందులో భూస్వాములను ఉద్దేశిస్తూ.. అక్షరాస్యత పెంపొందించేందుకు మీ ప్రాంత పిల్లలకు విద్య అందించేందుకు పాఠశాలలను చేయమని సూచించారు. గత తొమ్మిది దశాబ్దాల క్రితం నాటి ఈ పత్రాలు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మనం సాగించిన పోరాటానికి ఆనవాళ్లుగా నిలుస్తాయని ప్రాచీన ప్రతుల శాఖ అధికారి అగ్నిహోత్రి తెలిపారు. అలహాబాద్ విశ్వవిద్యాలయ ఆధునిక చరిత్ర విభాగ ఆచార్యుడు మాట్లాడుతూ. 1929లో ప్రజల్ని స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వాములను చేసేందుకు మహాత్మాగాంధీ ప్రతాప్‌గఢ్‌కు వచ్చారని తెలిపారు. ఈ సంపాదకీయంతో పాటు మహాత్మాగాంధీ దేశ స్వాతంత్య్రోద్యమం గురించి రాసిన కొన్ని ఇతర పత్రాలను జిల్లా కలెక్టర్ మార్కండేయ సాహి ప్రాచీన ప్రతుల అధికారులకు అందజేశారు. గాంధీజీ నడతేకాదు రాత కూడా అద్భుతంగా ఉంది. మనం ఆయన మార్గంలో నడుద్దాం, దేశాన్ని ప్రగతి పథంవైపు పోనిద్దాం.

-కేశవ