ఆగస్టు 6వ తేదీన ఢిల్లీ వెళ్లనున్న జగన్.. మోదీతో భేటీ.. అందుకోసమేనా..?

-

ఆగస్టు 6, 7 తేదీల్లో సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అంశాలపై కేంద్ర హోం, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రులతో సమావేశం కానున్నారు.

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టాక అటు అసెంబ్లీ సమావేశాలతోపాటు ఇటు ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంలో, గత ప్రభుత్వం చేసిన అవినీతిని తవ్వి వెలికి తీయడంలో ఇప్పటి వరకు నిమగ్నమయ్యారు. ఇక ఇప్పుడు ఆయన పర్యటనల బాట పట్టారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఈ నెలలో వరుస దేశ, విదేశీ పర్యటనలో బిజీ కానున్నారు. గురువారం సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలెం వెళ్లనున్నారు. అక్కడి నుంచి వచ్చాక 2 రోజులు ఢిల్లీలో ఉంటారు. ఆ తరువాత జగన్ అమెరికా వెళ్తారు.

ఆగస్టు 6, 7 తేదీల్లో సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధానిగా మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే జగన్ కూడా ఇటు ఏపీ సీఎంగా ప్రమాణం చేశారు. దీంతో మోదీ ప్రమాణస్వీకారానికి జగన్ హాజరు కాలేకపోయారు. అందుకనే ఇప్పుడు మోదీని జగన్ ప్రత్యేకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలపనున్నారు. ఇక ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను, సహాయ సహకారాలను కూడా జగన్ మోదీని అడగనున్నారు. అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు కూడా అపాయింట్‌మెంట్ కోరారు.

సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా పలు అంశాలపై కేంద్ర హోం, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రులతో సమావేశం కానున్నారు. ఇక ఢిల్లీ నుంచి వచ్చాక ఆగస్టు 8న పులివెందులలో పర్యటిస్తారు. అక్కడ తన బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి వేడుకల్లో జగన్ పాల్గొంటారు. అనంతరం అమెరికా వెళ్తారు. ఇక అమెరికా పర్యటన కోసం జగన్ ఇప్పటికే బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకుని యూఎస్ కాన్సులేట్‌లో వీసా కూడా తీసుకున్నారు.

cm ys jagan to go for delhi tour on august 6th

గురువారం కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలెం వెళ్లనున్న జగన్, ఆగస్టు 5న అమరావతికి వస్తారు. ఆగస్టు 17 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా అమెరికాలో జగన్ మిచిగన్, డెట్రాయిల్, కోబో కన్వెన్షన్ సెంటర్‌లో ప్రవాసాంధ్రులతో సమావేశమవుతారు. కాగా సీఎంగా బాధ్యతలు చేపట్టాక జగన్ వెళ్తున్న తొలి విదేశీ పర్యటనలు ఇవే కావడం విశేషం. గతంలోనే జగన్ సీఎం హోదాలో డిప్లొమాటిక్ పాస్‌పోర్టు పొందారు. అందుకు గాను విజయవాడలో ఉన్న పాస్‌పోర్టు కార్యాలయానికి జగన్ వెళ్లారు. ఇక జగన్ ఇప్పుడు వరుస పర్య టనలతో బిజీ కానుండడంతో ఆయా పర్యటనల్లో ఆయన ఏం చేస్తారనే విషయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది..!

Read more RELATED
Recommended to you

Latest news