యూట్యూబ్.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న పేరు. నేటి యువత తినకున్నా బతుకుతారేమో కాని.. యూట్యూబ్ లేకుంటే ఒక్క నిమిషం కూడా ఉండలేరు. యూట్యూబ్ లోనే నేటి యువత ఎక్కువగా గడుపుతున్నదట. యువత అంతా తమ విలువైన సమయాన్ని యూట్యూబ్ లో వీడియోలు చూడటానికే కేటాయిస్తున్నారట. యువతే కాదు.. ఎవరు యూట్యూబ్ లోకి వెళ్లినా మళ్లీ దాన్ని క్లోజ్ చేయడం అంత వీజీ కాదు. యూట్యూబ్ అంటే ఓ అడిక్షన్. ఆ అడిక్షన్ ఒక్కసారి అంటుకుందంటే ఇక అంతే. ఇంత సేపు యూట్యూబ్ లో గడిపామా? అని షాక్ అవడం తప్పించి చేసేదేమీ ఉండదు.
అందుకే.. మనకు మనం యూట్యూబ్ లో రోజుకు ఎంత సేపు గడుపుతున్నామో తెలుసుకోవడం కోసమని.. యూట్యూబ్ ఓ కొత్త టూల్ ను ప్రవేశపెట్టింది. అదే.. టైమ్ వాచ్డ్ అనే ఫీచర్. యూట్యూబ్ అకౌంట్ లో ఉన్న మెనులో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఓఎస్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే.. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది యూట్యూబ్. దాని ప్రకారం.. రోజులో ఎంత సమయం యూట్యూబ్ లో గడుపుతున్నారో అందులో తెలుసుకోవచ్చు.
ఇంతకుముందు యూట్యూబ్ ఆండ్రాయిడ్ యూజర్లకు టేక్ ఏ బ్రేక్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. దాంట్లో ఎంత టైమ్ యూట్యూబ్ లో యూజర్ గడపాలనుకుంటున్నాడో సెట్ చేసుకొనే వెసులుబాటు ఉండేది. అంటే 15, 30, 45, 60, 75, 90 ఇలా.. టైమ్ సెట్ చేసుకొని ఆ సమయం ముగిశాక యూట్యూబ్ కు బ్రేక్ ఇవ్వొచ్చన్నమాట.