నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్‌లలో కనీస బ్యాలెన్స్ ను ఇకపై మెయింటెయిన్ చేయాల్సిన పనిలేదు. దీని వల్ల టోల్ ప్లాజాల గుండా వాహనదారులు మరింత సులభంగా ప్రయాణం చేయవచ్చు.
ఫిబ్రవరి 15వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ను ఉపయోగించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసిన విషయం విదితమే. గతంలో పలుమార్లు ఇదే గడువును పొడిగించారు. ఇక చివరి తేదీగా ఫిబ్రవరి 15ను నిర్ణయించారు. అయితే ఫాస్టాగ్‌లను అందిస్తున్న బ్యాంకులు, డిజిటల్ వాలెట్లు అందులో కనీస బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయాలన్న షరతు విధిస్తున్నాయి. దీనికి తోడు ఫాస్టాగ్‌ను ఇచ్చే సమయంలో సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా వసూలు చేస్తున్నారు.
అయితే బ్యాంకులు, డిజిటల్ వాలెట్లు అలా చేస్తుండడం వల్ల ఫాస్టాగ్‌ను తీసుకునేందుకు, ఉపయోగించుకునేందుకు వాహనదారులు వెనుకడుగు వేస్తున్నారు. దీనికి తోడు టోల్‌ప్లాజాల గుండా వెళ్లేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కనీస బ్యాలెన్స్ లేని వాహనదారులకు టోల్ ప్లాజా ద్వారా వెళ్లడం కష్టం అవుతోంది. అయితే ఇకపై ఈ నిబంధన ఉండదని, కనీస బ్యాలెన్స్ లేకున్నా వాహనదారులు టోల్ ప్లాజాల గుండా వెళ్లవచ్చని, కానీ టోల్ ప్లాజాను దాటిన అనంతరం ఫాస్టాగ్ వాలెట్ లోంచి నగదు కట్ అయితే అప్పుడు నెగెటివ్ బ్యాలెన్స్‌లోకి వెళితే వాహనదారులు తరువాత చేసే రీచార్జి నుంచి ఆ మొత్తం నెగెటివ్ బ్యాలెన్స్‌ను బ్యాంకులు, డిజిటల్ వాలెట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్‌ను ప్రవేశపెట్టినందున వాహనదారులు ఇకపై ఫాస్టాగ్‌ల గుండా సులభంగా ప్రయాణం చేయవచ్చు.