మోటారు వాహ‌నాట చ‌ట్టం.. తొలి రోజే భారీ ఛ‌లాన్లు

మోటార్ వాహనాల నూతన చట్టం-2019 అమలులోకి వచ్చిన తొలి రోజు వాహ‌న‌దారుల‌కు అదిరిపోయే షాక్ ఇచ్చారు అధికారులు. నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ కొర‌డా ఝులిపించారు. దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు మెట్రో న‌గ‌రాలు అయిన ముంబై, క‌ల‌క‌త్తా లాంటి చోట్ల నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన వారిపై భారీ ఛ‌లాన్లు జారీ చేశారు. రాజ‌ధాని ఢిల్లీ నగరంలో వివిధ నిబంధనల కింద ఒక్క రోజులోనే 3,900 ఛలాన్లు జారీ అయ్యాయి.

ఇక‌పై కొత్త వాహ‌న చ‌ట్టం ప్ర‌కారం చిన్న త‌ప్పు జ‌రిగినా భారీగా ఫైన్లు క‌ట్టాల్సి ఉంటుంది. ఢిల్లీలో ఈ ఫైన్లు చూసిన‌ వాహ‌న‌దారులు బెంబేలెత్తిపోతున్నారు. అమ్మో..కొత్త చ‌ట్ట‌మా.. అంటూ రోడ్డుపైకి రావాలంటేనే వ‌ణికిపోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ సహా, ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తూ.. మోటార్ వాహనాల చట్టంలో సవరణలు చేసింది కేంద్రం. జులైలో ఈ బిల్లు పార్ల‌మెంటు ఆమోదం కూడా పొందింది.

ఈ క్ర‌మంలోనే ఈ నూత‌న చ‌ట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోతే.. రూ.1,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇది రూ.100గా ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే.. రూ.5,000 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇక ఈ చ‌ట్టం తెలంగాణ‌లో అమ‌ల్లోకి రాలేదు. అక్క‌డ శాస‌న‌స‌భ ఆమోదం పొందాకే అమ‌ల్లోకి రానుంది.